ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ ఫిక్స్ డిపాడిట్ వడ్డీ రేట్లలో మార్చింది. బ్యాంక్ అందించిన వివరాల ప్రకారం.. రూ.2 కోట్ల కంటే తక్కువ దేశీయ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. రేట్ల మార్పును బ్యాంక్ జూన్ 1, 2022న ప్రకటించింది. వడ్డీ రేట్లలో మార్పు కారణంగా బ్యాంక్ వివిధ కాలపరిమితితో ఉండే డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచింది. 7 రోజుల నుంచి 5 సంవత్సరాలు.. అంతకంటే ఎక్కువ డిపాజిట్లపై 2.80 శాతం నుంచి 5.35 శాతం మధ్యలో వడ్డీ రేట్లను సవరించింది.
బ్యాంకు 7 నుంచి 29 రోజుల పాటు ఉంచే డిపాజిట్లపై 2.80 శాతం వడ్డీ రేటును కొనసాగిస్తోంది. అయితే 30 నుంచి 45 రోజుల పాటు నిర్వహించే డిపాజిట్లపై వడ్డీ రేటు 2.80 శాతం నుంచి 3.00 శాతానికి అంటే 20 బేసిస్ పాయింట్లను పెంచింది. 46 రోజుల నుంచి 90 రోజుల మెచ్యూరిటీ వ్యవధి ఉన్న టర్మ్ డిపాజిట్లపై బ్యాంక్ 3.25 శాతం వడ్డీ రేటును కొనసాగిస్తుండగా.. 91 నుంచి 120 రోజుల మెచ్యూరిటీ వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 3.35 శాతం నుంచి 3.50కి పెంచింది. 121 రోజుల నుంచి 180 రోజుల టర్మ్ డిపాజిట్లపై.. ఇండియన్ బ్యాంక్ ఇప్పుడు 3.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇది గతంలో 3.50 శాతంగా ఉండేది అంటే 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు పెరిగింది.
181 రోజుల నుంచి 9 నెలల కంటే తక్కువ, 9 నెలల నుంచి ఏడాది కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై బ్యాంక్ 4.00 శాతం మరియు 4.40 శాతం వడ్డీ రేట్లను అందించడం కొనసాగిస్తోంది. ఒక సంవత్సరం టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.00 శాతం నుంచి 5.10 శాతానికి అంటే 10 బేసిస్ పాయింట్ల పెరిగింది. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కానీ.. రెండేళ్లలోపు డిపాజిట్లపై.. వడ్డీ రేటు 5.05 శాతం నుంచి 5.20 శాతానికి అంటే 15 బేసిస్ పాయింట్లు పెంచింది. రెండేళ్ల పైన మూడేళ్లలోపు టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.10 శాతం నుంచి 5.25 శాతానికి పెంచబడింది.
3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు డిపాజిట్లపై వడ్డీ రేటు 5.20 శాతం నుంచి 5.35 శాతానికి పెరిగింది. 5 సంవత్సరాల డిపాజిట్లపై వడ్డీ రేటు 5.25 శాతం నుంచి 5.35 శాతానికి పెరిగింది. 5 సంవత్సరాల కంటే ఎక్కువ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.15 శాతం నుంచి 5.35 శాతానికి బ్యాంక్ పెంచింది.