
రైల్వే ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కింది. శనివారం ఉదయం హౌరా-గువహతి మధ్య ప్రవేశపెట్టిన తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. మోదీ పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ విషయాన్ని మోదీ తన ఎక్స్ అకౌంట్‌లో తెలిపారు. మలోదాలో దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు త్వరలో మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.
త్వరలో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ఆ రాష్ట్రంలో ప్రారంభించారు. ఈ రైలు పశ్చిమబెంగాల్‌లోని హౌరా నుంచి అస్సాంలోని గువహతి వరకు సర్వీసులు అందించనుంది. కేవలం 958 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు 14 గంటల్లో కవర్ చేయనుంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించనుంది. ప్రస్తుతం ఈ రూట్లో నడుస్తున్న రైళ్ల సామర్థ్యం 130 కిలోమీటర్లుగా ఉంది.
ఈ రైలు సాయంత్రం 6.20 గంటలకు హౌరా నుంచి బయలుదేరుతుంది. తర్వాతి రోజు ఉదయం 8.20 గంటలకు కామాఖ్య స్టేషన్‌కు చేరుకుంటుంది. ఇక సాయంత్రం 6.15 గంటలకు కామాఖ్య నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు హౌరాకు చేరుకుంటుంది. హౌరా నుంచి గురువారం మినహా మిగతా రోజుల్లో, కామాఖ్య నుంచి బుధవారం మినహా మిగతా రోజుల్లో ఈ రైలు సేవలు అందించనుంది. ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
Delighted to flag off India’s first Vande Bharat sleeper train from Malda. Several Amrit Bharat train services are also being introduced to boost connectivity.
https://t.co/rh7OaIeTvR— Narendra Modi (@narendramodi) January 17, 2026