Post Office: పోస్టాఫీస్‌లో మరో అద్భుత స్కీమ్.. తక్కువ పెట్టుబడితో చేతికి రూ.7లక్షలు

పోస్టాఫీస్ పథకాలు ఆర్థిక భద్రతను అందించడంతో పాటు భవిష్యత్ అవసరాలను తీర్చడానికి ఒక నమ్మకమైన మార్గాన్ని అందిస్తాయి. అందుకే ఈ మధ్య చాలా మంది ఈ పథకాల వైపు మళ్లుతున్నారు. అటువంటి వారికి పోస్టాఫీస్ RD పథకం మంచి ఆప్షన్. ఈ పథకంలో కేవలం ఐదేళ్లలోనే రూ.7 లక్షల వరకు ఆదా చేయవచ్చు.

Post Office: పోస్టాఫీస్‌లో మరో అద్భుత స్కీమ్.. తక్కువ పెట్టుబడితో చేతికి రూ.7లక్షలు
Post Office Rd Scheme

Updated on: Aug 22, 2025 | 5:36 PM

ఈ మధ్య కాలంలో ప్రజలు ఎక్కువగా పోస్టాఫీస్ పథకాల వైపు చూస్తున్నారు. సురక్షితమైన, స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారికి పోస్ట్ ఆఫీస్ పథకాలు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి. తక్కువ రిస్క్‌తో తమ పెట్టుబడులకు పూర్తి భద్రత ఉండటంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లలో పెట్టుబడులు పెడుతున్నారు. నేటి బిజీ జీవితంలో భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడం అత్యంత అవసరం. పిల్లల చదువులు, పెళ్లి, ఇల్లు నిర్మాణం వంటి ఏ లక్ష్యానికైనా ఆర్థిక ప్రణాళిక తప్పనిసరి. అయితే చాలా మంది తక్కువ రిస్క్‌తో మంచి రాబడిని ఇచ్చే పథకాలలో పెట్టుబడి పెట్టాలని చూస్తారు. అలాంటి వారికి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒక అద్భుతమైన ఎంపిక. ప్రభుత్వ హామీతో నడిచే ఈ పథకంలో కేవలం ఐదేళ్లలోనే రూ. 7 లక్షలకు పైగా ఆదా చేయవచ్చు.

పోస్ట్ ఆఫీస్ RD అంటే ఏమిటి..?

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అనేది ఒక సురక్షితమైన, నమ్మదగిన పొదుపు పథకం. దీనిలో మీరు ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేయాలి. ఈ పథకాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి మీ పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది. ముఖ్యంగా దీనిలో వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి జమ చేస్తారు. దీనివల్ల మీ డబ్బు వేగంగా పెరుగుతుంది.

ఐదేళ్లలో రూ. 7 లక్షలు ఎలా..?

పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీలో మీరు కేవలం నెలకు రూ. 100 తో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే మీరు ప్రతి నెలా రూ.10,000 చొప్పున డిపాజిట్ చేస్తే.. ఐదేళ్లలో మీరు రూ. 7,13,659 పొందవచ్చు. ఈ మొత్తంలో మీ అసలు డిపాజిట్ రూ. 6 లక్షలు కాగా మిగిలిన రూ. 1,13,659 వడ్డీ రూపంలో వస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ RDపై 6.7శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేటును ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి జమ చేస్తుంది.

పథకం ప్రయోజనాలు

ఈ పథకం ప్రాథమికంగా ఐదేళ్ల కాలానికి ఉంటుంది. కానీ మీరు కోరుకుంటే దానిని మరో ఐదేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. అంటే మొత్తం 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఒక పెద్ద నిధిని సృష్టించుకోవచ్చు. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో డబ్బు అవసరమైతే, ఒక సంవత్సరం తర్వాత మీరు డిపాజిట్ చేసిన మొత్తంపై 50శాత వరకు రుణం తీసుకోవచ్చు. ఈ రుణానికి వడ్డీ రేటు, RD వడ్డీ రేటు కంటే 2శాతం ఎక్కువగా ఉంటుంది.

మొత్తంగా తక్కువ రిస్క్‌తో, సురక్షితమైన పెట్టుబడి పెట్టేవారికి పోస్ట్ ఆఫీస్ RD ఒక గొప్ప ఎంపిక. క్రమం తప్పకుండా పొదుపు చేసే అలవాటు ఉన్నవారు ఈ పథకంతో తమ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..