
సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ఉండి, ఎక్కువ పెట్టుబడి పెట్టలేక ఆలోచిస్తున్న వారికి భారత పోస్టల్ శాఖ ఒక అద్భుతమైన శుభవార్త చెప్పింది. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ 2.0 పేరుతో సరికొత్త బిజినెస్ నమూనాను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా సాధారణ పౌరులు కూడా పోస్టల్ విభాగంలో భాగస్వాములు కావచ్చు. ఏటీఎం లేదా పెట్రోల్ బంకుల ఫ్రాంచైజీల తరహాలోనే మీ ప్రాంతంలో ఒక అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేసి తపాలా సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావచ్చు.
ఈ ఫ్రాంచైజీలో ప్రధానంగా రెండు రకాల అవకాశాలు ఉన్నాయి. మొదటిది ఫ్రాంచైజీ అవుట్‌లెట్. దీని ద్వారా మీరు నేరుగా స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, మనీ ఆర్డర్లు, స్టాంపుల విక్రయం వంటి కౌంటర్ సేవలను నిర్వహించవచ్చు. రెండవది పోస్టల్ ఏజెంట్ విధానం. ఇందులో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ వస్తువులను విక్రయించడం ద్వారా లాభాలను ఆర్జించవచ్చు. పోస్టాఫీసు సౌకర్యం లేని లేదా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి డిమాండ్ ఉంటుంది.
ఈ వ్యాపారంలో పెట్టుబడి చాలా తక్కువ, కానీ ఆదాయం మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. కేవలం రూ.5,000 సెక్యూరిటీ డిపాజిట్‌తో ఈ ఫ్రాంచైజీని ప్రారంభించవచ్చు. ఆదాయం అంతా కమిషన్ల రూపంలో ఉంటుంది. ఉదాహరణకు.. ప్రతి రిజిస్టర్డ్ పోస్ట్‌పై రూ.3, స్పీడ్ పోస్ట్‌పై రూ.5, మనీ ఆర్డర్లపై రూ.3.50 నుండి రూ.5 వరకు కమిషన్ లభిస్తుంది. ఒకవేళ మీరు నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేస్తే అదనంగా 20 శాతం ఇన్సెంటివ్ కూడా అందుకోవచ్చు. మీ దగ్గరకు వచ్చే కస్టమర్ల రద్దీని బట్టి నెలకు దాదాపు రూ.80,000 వరకు సంపాదించే వీలుంది.
అర్హతల విషయానికి వస్తే 18 ఏళ్లు నిండిన ఏ భారతీయ పౌరుడైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అయితే పోస్టల్ శాఖలో పనిచేసే ఉద్యోగుల కుటుంబ సభ్యులకు మాత్రం ఈ ఫ్రాంచైజీ పొందే అవకాశం లేదు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తమ సమీపంలోని మెయిన్ పోస్టాఫీస్‌ను సంప్రదించి దరఖాస్తు ఫారాన్ని తీసుకోవాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, విద్యార్హత పత్రాలను జతచేసి సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి పోస్టల్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తుంది. తక్కువ రిస్క్, ప్రభుత్వ గుర్తింపుతో కూడిన ఈ బిజినెస్ మధ్యతరగతి వారికి ఒక మంచి ఆదాయ మార్గం అని చెప్పవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి