పిల్లలకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నారా? మీరెంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసుకోండి!

పిల్లలు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడం వారి ఆర్థిక అలవాట్లను దెబ్బతీస్తుంది. దీనివల్ల డబ్బు విలువ తెలియకపోవడం, క్రమశిక్షణ లోపించడం, పొదుపు లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఖర్చులపై నియంత్రణ కోల్పోయి, భవిష్యత్తులో అప్పుల బారిన పడే ప్రమాదం ఉంది. విలువ నేర్పడమే వారి భవిష్యత్తుకు మేలు.

పిల్లలకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నారా? మీరెంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసుకోండి!
Kids Financial Literacy

Updated on: Mar 05, 2026 | 8:30 AM

పిల్లలు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడం ప్రేమగా భావించే తల్లిదండ్రులు చాలామందే ఉన్నారు. అయితే ఇది దీర్ఘకాలంలో పిల్లల ఆర్థిక అలవాట్లు, వ్యక్తిత్వంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. డబ్బు విలువ తెలియకపోవడం ప్రధాన సమస్యగా మారుతుంది. ఎప్పుడు అడిగినా డబ్బు సులభంగా దొరికితే, సంపాదించడం ఎంత కష్టం అన్న అవగాహన పిల్లల్లో ఏర్పడదు. దీని వల్ల భవిష్యత్తులో ఖర్చులపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అవసరం–ఆడంబరం మధ్య తేడా గుర్తించే సామర్థ్యం తగ్గిపోతుంది. ప్రతి చిన్న కోరికను వెంటనే తీర్చడం వల్ల పిల్లలు సహనం కోల్పోయి ఇప్పుడే కావాలి అనే మనస్తత్వాన్ని అలవాటు చేసుకునే అవకాశం ఉంది. ఇది తరువాత జీవితంలో ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీయవచ్చు.

పొదుపు అలవాటు ఉండదు. చిన్నప్పుడే ఖర్చు చేసే స్వభావం పెరిగితే, పెద్దయ్యాక కూడా సేవింగ్‌పై దృష్టి తగ్గుతుంది. ఇది భవిష్యత్తులో అప్పుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఒక ఆందోళనకర అంశం బాధ్యతాభావం తగ్గిపోవడం. డబ్బు విలువ తెలియని పిల్లలు వస్తువులను నిర్లక్ష్యంగా ఉపయోగించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఇది అజాగ్రత్త ఖర్చులు లేదా అనవసర అలవాట్లకు దారి తీస్తుంది.

నిపుణుల సూచన ప్రకారం.. పిల్లలకు పూర్తిగా డబ్బు నిరాకరించాల్సిన అవసరం లేదు. కానీ పాకెట్ మనీకి పరిమితి పెట్టడం, ఖర్చు–పొదుపు గురించి నేర్పించడం, లక్ష్యంతో డబ్బు ఇవ్వడం వంటి పద్ధతులు పాటిస్తే మంచి ఆర్థిక అలవాట్లు పెంపొందుతాయి. మొత్తంగా ప్రేమ పేరుతో విచ్చలవిడిగా డబ్బు ఇవ్వడం కంటే, డబ్బు విలువ నేర్పించడం పిల్లల భవిష్యత్తుకు మరింత మేలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us