ఇక మీ బండి ఎక్స్‌లేటర్ రెయిజ్ చేయొచ్చు. రోడ్ల మీద దూసుకుపోవచ్చు. బతుకుభారం నుంచి రిలీఫ్ కావచ్చు. ఎందుకంటే, లోక్‌సభ ఎన్నికల ముందు ప్రధాని మోదీ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయడానికి సిద్ధం అయ్యారు. ధరల భారం నుంచి దేశ ప్రజలకు రిలీఫ్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా తగ్గించడానికి మోదీ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. లీటర్ మీద ఎనిమిది రూపాయలు, డీజిల్ మీద పది రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. కొత్త సంవత్సరానికి మోదీ ధమాకా కానుక ఇవ్వడం ఖాయమని అనుకుంటున్నారు. రేపో, ఎల్లుండో ఈ ప్రకటన నేరుగా మోదీనే చేయవచ్చని భావిస్తున్నారు. పెట్రోలియమ్ శాఖ ఇప్పటికే ఈ ధరల తగ్గింపు కసరత్తును పూర్తిచేసింది. అంటే ఇప్పటికే సెంచరీ దాటిన పెట్రోల్ ధరలు కాస్త దిగి వచ్చే చాన్స్ ఉంది.
మోదీ సర్కార్ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం ఇదే తొలిసారి కాదు. 2022 మే 22 నాడు కేంద్ర ప్రభుత్వం ఇదే రకమైన తగ్గింపును ప్రకటించింది. అప్పట్లో లీటర్ పెట్రోల్ మీద ఎనిమిది రూపాయలు, లీటర్ డీజిల్ మీద ఆరు రూపాయలు తగ్గించారు. తాము ఎక్సయిజ్ సుంకాలు తగ్గించాం కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రెండు ఇంధనాల మీద వ్యాట్ తగ్గించాలని కేంద్రం ఒత్తిడి తెచ్చింది. అయితే, బీజేపీ పాలిత రాష్ట్రాలు వెంటనే వ్యాట్‌ను తగ్గించాయి.
తాజాగా, ప్రధాని మోదీ ప్రకటించబోయే పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు అంశం- జనం నెత్తిన పాలు పోసే అవకాశం ఉంది. అలాగే, రాజకీయంగా బీజేపీకి మేలు చేయవచ్చని అంచనాలు వస్తున్నాయి. ఇప్పటికే ఒకవైపు ఇండియా కూటమి వరుస భేటీలతో వేడి పుట్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో విపక్షాలపై ధరల తగ్గింపు అస్త్రాన్ని ప్రయోగించాలని మోదీ భావిస్తున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలన్న వ్యూహం సక్సెస్ కావాలంటే, ధమాకా నిర్ణయం తీసుకోవడం సమంజసమని కాషాయసైన్యం అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ధమాకా న్యూస్ వినడానికి మనమంతా సిద్ధం కావల్సిందే.