
సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని అందరూ భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, బిట్ కాయిన్స్‌లో భారీ కుదుపులు ఉంటాయి. దీంతో వాటిల్లో పెట్టుబడులు పెట్టడం హైరిస్క్‌తో కూడుకున్నది. దీంతో సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వైపు పెట్టుబడిదారులు ఎక్కువగా చూస్తుంటారు. అలాగే సాధారణ ప్రజలు కూడా ప్రతీ నెలా కొంతమొత్తం గోల్డ్‌లో పెట్టుబడి పెడుతుంటారు. బంగారంలో పెట్టుబడి పెట్టాలంటే అనేక మార్గాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. జ్యువెలరీ షాపులు గోల్డ్ ప్లాన్లు తీసుకొస్తున్నాయి. వీటి ద్వారా ప్రతీ నెలా గోల్డ్‌లో చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక ఫిజికల్ గోల్డ్ ఒకేసారి కొనడం, డిటిజల్ గోల్డ్ కొనడం, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్స్ సిప్ ద్వారా బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఫిజికల్ గోల్డ్ కొనేవారు కొంతమంది ఉంటే.. గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్(ETF) విధానంలో పెట్టుబడులు పెట్టేవారు మరికొంతమంది ఉన్నారు. అయితే ఈ రెండింటిల్లో ఏ మార్గంలో బంగారం కొంటే ఎక్కువ లాభం జరుగుతుందనే అవగాహన చాలామందికి ఉండదు. ఆభరణాలు, కడ్డీలు, కాయిన్స్ రూపంలో ఫిజికల్ గోల్డ్ కొనవచ్చు. వీటిని మనం ఇంట్లో లేదా బ్యాంక్ లాకర్లలో ఉంచుకోవచ్చు. ఇక గోల్డ్ ఈటీఎఫ్‌లు కాస్త భిన్నంగా ఉంటాయి. మన వద్ద బంగారం ఉంచుకోకుండానే ఈటీఎఫ్‌ల ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. మీకు ఆభరణాలు కావాలనుకుంటే ఫిజికల్ గోల్డ్ కొనడం మంచిది. కేవలం పెట్టుబడి కోసం అయితే ఈటీఎఫ్‌లు ఉంచుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
మీరు ఆభరణాల రూపంలో కొంటే మేకింగ్ ఛార్జీలు, 3 శాతం జీఎస్టీ, ఇతర అదనపు ఖర్చులు ఉంటాయి. మీ డిజైన్‌ను బట్టి మేకింగ్ ఛార్జీలు పెరగవచ్చు. దీని వల్ల బంగారం ధర కంటే మీరు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే ఈటీఎఫ్‌ల ద్వారా పెట్టుబడి పెడితే మీకు మేకింగ్, జీఎస్టీ వంటివి ఆదా అవుతాయి. ఈటీఎఫ్‌లలో బ్రోకరేజ్, ఇతర ఛార్జీలు తక్కువగానే ఉంటాయి. ఫిజికల్ బంగారాన్ని బ్యాంకుల్లో ఉంచుకుంటే లాకర్ ఛార్జీలు, ఇంట్లో ఉంచుకుంటే దొంగతనం భయం వంటివి ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి కాబట్టి అలాంటి భయం ఉండదు. ఇక ఫిజికల్ గోల్డ్ విక్రయించేటప్పుడు ప్రస్తుత ధరలు, స్వచ్చతమై ఆధారపడి ఉంటుంది. 24 నెలల కంటే ఎక్కువ కాలం పాటు ఉంచిన ఫిజికల్ బంగారం మూలధన ఆస్తిగా పరిగణిస్తారు. మీరు బంగారం విక్రయించగా వచ్చిన లాభాలపై ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అయితే గోల్డ్ ఈటీఎఫ్‌లు 12 నెలల తర్వాత పన్నుకు అర్హత పొందుతాయి. లాభాలపై 12.5 శాతం ట్యాక్స్ విధిస్తారు. దీంతో ఈ ఆదాయపు పన్ను శ్లాబులను కూడా పరిశీలించండి.