NPSలో కీలక అప్డేట్‌! రెండు కొత్త డ్రాడౌట్‌ ఆప్షన్స్‌ తీసుకొచ్చిన PFRDA

పిఎఫ్‌ఆర్‌డిఎ నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఖాతాదారుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. పదవీ విరమణ అనంతరం నెలవారీ ఆదాయం కోసం కొత్త RIS స్టెడీ ఫండ్‌తో పాటు SPR, SUR వంటి రెండు డ్రాడౌన్ ఎంపికలను ప్రవేశపెట్టింది. దీనివల్ల చందాదారులు తమ పెన్షన్ కార్పస్‌ను ఒకేసారి కాకుండా, అవసరాలకు అనుగుణంగా దశలవారీగా ఉపసంహరించుకునే సౌలభ్యం లభిస్తుంది.

NPSలో కీలక అప్డేట్‌! రెండు కొత్త డ్రాడౌట్‌ ఆప్షన్స్‌ తీసుకొచ్చిన PFRDA
Nps

Updated on: May 16, 2026 | 9:12 AM

పదవీ విరమణ తర్వాత నెలవారీ ఆదాయం విషయంలో ఖాతాదారులకు మరింత సౌలభ్యం కల్పించే దిశగా పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (PFRDA) కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద కొత్తగా రిటైర్మెంట్ ఇన్‌కమ్ స్కీమ్ (RIS)తో పాటు రెండు కొత్త డ్రాడౌన్ ఎంపికలను ప్రవేశపెట్టింది. మే 15, 2026న విడుదలైన సర్క్యులర్ ప్రకారం పదవీ విరమణ అనంతరం చందాదారులు తమ పెన్షన్ కార్పస్‌ను దశలవారీగా ఉపసంహరించుకునే అవకాశం పొందనున్నారు.

కొత్తగా ప్రవేశపెట్టిన RIS స్టెడీ ఫండ్ ప్రత్యేకంగా పదవీ విరమణ దశ కోసం రూపొందించబడింది. ఇందులో వయస్సు పెరిగే కొద్దీ ఈక్విటీ పెట్టుబడులను ఆటోమేటిక్‌గా తగ్గించే గ్లైడ్ పాత్ విధానం అమలులో ఉంటుంది. 60 ఏళ్ల వయస్సులో 35 శాతం ఈక్విటీలో, 10 శాతం కార్పొరేట్ బాండ్లలో, 55 శాతం ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి ఉండగా, 75 ఏళ్ల నాటికి ఈక్విటీ వాటా 10 శాతానికి తగ్గుతుంది. PFRDA రెండు రకాల డ్రాడౌన్ ఎంపికలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటి ఎంపిక సిస్టమాటిక్ పేయౌట్ రేట్ (SPR). ఇందులో చందాదారుడి వయస్సు ఆధారంగా ప్రతి ఏడాది కార్పస్‌లో ఒక నిర్దిష్ట శాతం ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 60 ఏళ్ల వయస్సులో ఉన్నవారు సంవత్సరానికి సుమారు 4 శాతం, 70 ఏళ్ల వయస్సులో ఉన్నవారు 6.67 శాతం వరకు తీసుకోవచ్చు. వయస్సు పెరిగే కొద్దీ చెల్లింపు శాతం కూడా పెరుగుతుంది.

రెండవ ఎంపిక సిస్టమాటిక్ యూనిట్ రిడంప్షన్(SUR). ఇందులో మొత్తం యూనిట్లను సమానంగా విభజించి ప్రతి నెలా ఒకే సంఖ్యలో యూనిట్లు రిడీమ్ చేస్తారు. అయితే చెల్లింపు మొత్తం అప్పటి మార్కెట్ NAVపై ఆధారపడి మారుతుంది. ఈ కొత్త విధానం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఉపయోగపడనుంది. అయితే చెల్లింపులకు ఎలాంటి హామీ ఉండదని, ఇవి పూర్తిగా మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయని PFRDA స్పష్టం చేసింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం పదవీ విరమణ అనంతరం ఒకేసారి మొత్తం డబ్బు తీసుకోవడం కంటే, అవసరాలకు అనుగుణంగా దశలవారీగా ఆదాయం పొందాలనుకునే వారికి ఈ కొత్త RIS, డ్రాడౌన్ ఎంపికలు ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us