
దేశంలో కోట్లాది మంది ప్రైవేట్ ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్లు కలిగి ఉన్నారు. ఈ ఖాతాలతో ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. పీఎఫ్ ఖాతాలోని సొమ్ముపై వార్షిక వడ్డీ అందించడంతో పాట 60 ఏళ్లు పూర్తైన తర్వాత నెలనెలా పెన్షన్ కూడా ఇస్తోంది. ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు ఈపీఎఫ్‌వో సౌకర్యంతో ఆర్ధిక భద్రత పొందుతున్నారు. ఇటీవల ఈపీఎఫ్‌వోలో కేంద్రం అనేక సంస్కరణలు చేపుడుతోంది. ఈపీఎఫ్‌వో 3.0లో భాగంగా పీఎఫ్ ఖాతాదారులు ఉపయోగపడేపలా అనేక నిబంధనలను సడలించింది. పీఎఫ్ విత్ డ్రాలను సులభతరం చేయడంతో పాటు ఆన్‌లైన్ ద్వారా సులువుగా అన్నీ సేవలు పొందేలా త్వరలో కొత్త పోర్టల్‌ను కూడా తీసుకురానుంది. ఈ క్రమంలో పీఎఫ్ ఖాతాదారులకు షాకిచ్చేందుకు కేంద్రం సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పీఎఫ్ అకౌంట్లోని డబ్బులపై కేంద్రం ప్రతీ ఏటా వార్షిక వడ్డీ అందిస్తూ ఉంటుంది. ఈ వడ్డీ ఒకేలా ఉండదు. ప్రతీ ఏడాది ఈ వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభానికి ముందే ముందు ఆర్ధిక సంవత్సరానికి ఎంత వడ్డీ ఇవ్వాలనేది కేంద్రం ప్రకటించడం అనవాయితీగా వస్తోంది. త్వరలో 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ కానున్న క్రమంలో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఈపీఎఫ్‌వో వడ్డీ రేటును కేంద్రం త్వరలో ప్రకటించనుంది. అయితే ఈ సారి వడ్డీ రేటును తగ్గించనుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. దీనిని 8.20 శాతం లేదా 8 శాతానికి తగ్గించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మార్చి తొలివారంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరగనుంది. ఈ సమీక్ష సమావేశంలో వడ్డీని ఫిక్స్ చేయనున్నారని సమాచారం. ఒకవేళ వడ్డీ తగ్గిస్తే పీఎఫ్ అకౌంట్లు ఉన్న కోట్లాది మందికి ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు.
వడ్డీ రేటును తగ్గించడం వల్ల పీఎఫ్ డిపాజిట్లపై వచ్చే ఆదాయం తగ్గనుంది. జీతంపై ఆధారపడి జీవించేవారికి ఇది షాక్‌గా చెప్పవచ్చు. తొలుత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో వడ్డీని నిర్ణయించి కేంద్ర ఆర్ధికశాఖకు ప్రతిపాదనలు పంపుతారు. కేంద్రం ఆర్ధికశాఖ నిర్ణయం తీసుకుని ప్రకటించనుంది. అనంతరం కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ నోటిఫై చేస్తుంది. ఈ నోటిఫికేషన్ తర్వాత పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లో వడ్డీని జమ చేస్తారు. ఉద్యోగులు ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్లోకి వెళ్లి వడ్డీని చెక్ చేసుకోవచ్చు. అటు మార్చిలో జరగనున్న సమావేశంలో పీఎఫ్ కనీస వేతన పరిమితిని కూడా పెంచనున్నారని తెలుస్తోంది.