
PF ఖాతాదారులకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని EPFOకు చెందిన CBT తీసుకుంది. అయితే ఈ వడ్డీ మొత్తం ఉద్యోగుల ఖాతాల్లోకి ఎప్పుడు జమ అవుతుందనే విషయంపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టమైన తేదీని ప్రకటించలేదు. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగుల్లో ఆసక్తి పెరిగింది. నిపుణుల సమాచారం ప్రకారం.. వడ్డీ మొత్తాన్ని ఖాతాల్లో జమ చేసే ప్రక్రియకు సాధారణంగా కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి ఒక నిర్దిష్ట ప్రక్రియ ఉంటుంది. మొదట EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రతి ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును నిర్ణయిస్తుంది.
ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. కేంద్ర ప్రభుత్వం దీనిని పరిశీలించి తుది ఆమోదం ఇచ్చిన తర్వాతే వడ్డీ మొత్తాన్ని సభ్యుల ఖాతాల్లో జమ చేస్తారు. ప్రస్తుతం మొదటి దశ పూర్తయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ ఆమోదం రావడానికి సుమారు మూడు నెలల వరకు సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. EPF వడ్డీ లెక్కింపు కూడా నిర్దిష్ట నియమాల ప్రకారం జరుగుతుంది. EPF స్కీమ్ 1952లోని నిబంధనల ప్రకారం వడ్డీ లెక్కింపు పద్ధతి నిర్ణయించబడింది. ఆర్థిక సంవత్సరం చివరలో ఖాతాలో ఉన్న మొత్తం బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీ లెక్కిస్తారు. అంటే గత సంవత్సరం చివరి బ్యాలెన్స్‌పై పూర్తి 12 నెలలకు వడ్డీ వర్తిస్తుంది.
ఒకవేళ సభ్యుడు ఆర్థిక సంవత్సరంలో PF ఖాతా నుంచి కొంత మొత్తాన్ని ఉపసంహరించుకుంటే, ఆ మొత్తం ఉపసంహరించిన తేదీ వరకు మాత్రమే వడ్డీ లెక్కిస్తారు. ఆ తేదీ తర్వాత ఆ మొత్తంపై వడ్డీ వర్తించదు. అయితే ఉపసంహరణకు ముందు కాలానికి వడ్డీ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి PF ఖాతాలో కొత్తగా జమ చేసిన మొత్తంపై కూడా వడ్డీ లభిస్తుంది. అయితే ఆ మొత్తం జమ చేసిన నెల తర్వాతి నెల మొదటి రోజు నుంచి మార్చి 31 వరకు వడ్డీ లెక్కిస్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం ఇచ్చిన తర్వాతే 8.25 శాతం వడ్డీ మొత్తాన్ని ఉద్యోగుల PF ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం. సాధారణంగా జూన్ లేదా జూలై నెలల్లో ఈ వడ్డీ జమ అయ్యే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి