
కీలకమైన హర్ముజ్ సముద్ర మార్గంలో సరుకు రవాణాకు ఆటంకం కలగడంతో.. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై దీని ప్రభావం పడుతుంది. ఇక భారత్‌పై కూడా దీని ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే దేశంలో గ్యాస్ ధరలు పెరగ్గా.. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమంది అప్రమత్తమై ముందుగానే పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకుంటున్నారు. అయితే వీటిని నిల్వ చేసుకోవడం చట్టబద్దమేనా..? ఎంతవరకు నిల్వ చేసుకోవచ్చు..? అనే విషయాలు తెలుసుకుందాం.
పెట్రోలియం ఉత్పత్తులు మంటతో మండటానికి సరపడ ఆవిరిని విడుదల చేసే కనిష్ట ఉష్ణోగ్రతను ఫ్లాష్ పాయింట్ అని పిలుస్తారు. దీని ఆధారంగా పెట్రోలియం ఉత్పత్తులను మూడు వర్గాలుగా విభించారు. ఫ్లాష్ పాయింట్ 23 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటే క్లాస్ ఎ పెట్రోలియం కేటగిరీగా పరిగణిస్తారు. ఇక 23 డిగ్రీల కంటే ఎక్కువ లేదా 65 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే క్లాస్ బిగా పిలుస్తారు. ఇక 65 డిగ్రీల కంటే ఎక్కువ లేదా 93 డిగ్రీల కంటే తక్కువ ఉంటే క్లాస్ సీగా పరిగణిస్తారు.
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ నిబంధనల ప్రకారం.. క్లాస్ ఏ రకానికి చెందిన పెట్రోలియంను అమ్మకం కోసం కాకపోతే 30 లీటర్ల వరకు నిల్వ చేసుకోవడానికి లైసెన్స్ అవసరం లేదు. ఇంతకుమించి నిల్వ చేసుకోవడం చట్టబద్దంగా నిషేధం అమల్లో ఉంది. వ్యాపార అవసరాల కోసం కాని పక్షంలో అంతకంటే ఎక్కువ నిల్వ చేసుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు.
పెట్రోల్, డీజిల్‌ను ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే పాడైపోతాయి. గాలి తగలకుండా ఒక పాత్రలో పెట్రోల్‌ను నిల్వ చేస్తే అది కొద్దిరోజులకు అవిరైపోతుంది. అదే నీడలో గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే ఒక ఏడాది పాటు ఉంటుంది. అదే డబ్బా మూత తెరిస్తే నిల్వ కాలం కూడా తగ్గుతూ వస్తుంది. అదే 20 డిగ్రీల సెల్సియస్ దగ్గర సుమారు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది. అదే 30 డిగ్రీల సెల్సియస్ వద్ద మూడు నెలల పాటు పాడై పోకుండా నిల్వ ఉంటుంది.
ఇక పెట్రోల్ అంత ఈజీగా డీజిల్ పాడైపోదు. అయితే డీజిల్‌ను ఎక్కువకాలం నిల్వ ఉంచితే జిగురు ఏర్పడి ఇంజిన్ ఫిల్టర్లు మూతపడేలా చేస్తుంది. అలాగే ఇంధనం రంగు ముదురుగా మారుతుంది. గాలి చొరబడని డబ్బాలో నీడలో డీజిల్ నిల్వ చేస్తే సుమారు ఒక ఏడాది పాటు పాడైపోకుండా ఉంటుంది. అయితే దీర్ఘకాలంలో డీజిల్ నిల్వ చేయాలంటే ప్రతీ ఆరు నెలలకు ఒకసారి బయోసైడ్ చికిత్స చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.