
భారత్‌లో నివసించే ప్రతీఒక్కరికీ అత్యంత అవసరమైన డాక్యుమెంట్ ఆధార్ కార్డ్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి సంక్షేమ పథకాల వరకు దేనికైనా ఇది ఉండాల్సిందే. ఈ డాక్యుమెంట్ లేకుండా మనం ఇండియాలో ఎలాంటి ప్రభుత్వ సర్వీసులు పొందలేము. ఇక ప్రైవేట్ పరంగా అనేక సేవలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డు గురించి ఏదైనా చిన్న మార్పు జరిగినా దేశంలోని కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది

2025లో ఆధార్ విషయంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అనేక మార్పులు కొత్తగా అమల్లోకి తెచ్చింది. ఆధార్ ఉపయోగంలో పారదర్శకత, భద్రత కల్పించాలనే లక్ష్యంతో కొత్త రూల్స్ తెచ్చింది. అలాగే సులువుగా, సరళంగా ఉపయోగించేందుకు డిజిటల్ విధానంలో మార్పులు చేస్తూ కొత్త యాప్ తీసుకొచ్చింది. దీంతో పాటు ఆధార్ అప్డేట్ ఫీజులను కూడా పెంచింది.

గతంలో ఆధార్‌లో బయోమెట్రిక్ డీటైల్స్ అప్డేట్ చేసుకోవడానికి ఫీజు రూ.100కి ఉండేది. ఈ ఏడాది దానిని రూ.125కి పెంచారు. ఇక పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ వంటి వివరాలు అప్డేట్ చేసుకోవడానికి గతంలో రూ.50 ఫీజు ఉండేది. 2025లో దానిని రూ.75కి మార్చారు.ఆధార్ వ్యవస్థను మెరుగుపర్చడానికి, సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ రుసుములను పెంచారు

2025లో ఆధార్ పేరుతో UIDAI కొత్త సూపర్ సెక్యూర్ యాప్‌ను లాంచ్ చేసింది. ఫిజికల్ ఆధార్ కార్డును వెరిఫికేషన్ కోసం ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఈ యాప్ ద్వారా డిజిటల్ ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో మీ ఆధార్ డిజిటల్ వెర్షన్ ఉంటుంది. మీరు ఏదైనా సేవకు ఆధార్ జిరాక్స్ కాపీలు అందించాల్సిన అవసరం లేకుండా ఈ యాప్ ద్వారా ఫోన్‌లోనే డిజిటల్ ఆధార్ చూపించి వెరిఫికేషన్ చేసుకోవచ్చు.

ఈ ఏడాదిలో ఇంటి నుంచే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఆధార్ సెంటర్‌కు వెళ్లి క్యూలైన్‌లో గంటల కొద్ది నిల్చోవాల్సి వచ్చేంది. ఇప్పుడు ప్రజలకు ఆ ఇబ్బంది తప్పింది.