RBI: న్యూ ఇయర్ వేళ ఆర్బీఐ నుంచి బ్యాడ్‌న్యూస్.. బ్యాంక్ ఖాతాదారులకు నిరాశే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చెక్కుల క్లియరింగ్‌కు సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడాన్ని వాయిదా వేసింది. అమలు చేయడానికి మరింత సమయం ఇవ్వాలని బ్యాంకులు కోరాయి. దీంతో అందుకే ఆర్బీఐ అంగీకరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

RBI: న్యూ ఇయర్ వేళ ఆర్బీఐ నుంచి బ్యాడ్‌న్యూస్.. బ్యాంక్ ఖాతాదారులకు నిరాశే..
Money

Updated on: Dec 25, 2025 | 11:05 AM

కొత్త సంవత్సరం 2026 ప్రారంభం అవుతున్న క్రమంలో ఆర్బీఐ నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. చెక్కుల క్లియరెన్స్‌కి సంబంధించి రెండో దశ ప్రక్రియను అమలు చేయడానికి బ్యాంకులకు మరింత సమయం ఇచ్చింది. చెక్కులను డిపాజిట్ చేయగానే కొన్ని గంటల్లోనే బ్యాంకులు క్లియర్ చేసేలా గతంలో కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. రెండు దశలుగా దీనిని అమలు చేయాలని నిర్ణయించగా.. కొన్ని గంటల్లోనే చెక్కులు క్లియర్ చేసే తొలి దశ వ్యవస్థను ఈ ఏడాది అక్టోబర్ నుంచి చేపడుతోంది. రెండో దశను జనవరి నుంచి అమలు చేయాల్సి ఉండగా.. బ్యాంకులు తమ కార్యకలాపాలను క్రమబద్దీకరించుకపోవడానికి మరింత సమయం కోరడంతో ఆర్బీఐ గడువు ఇచ్చింది.

మూడు గంటల్లోనే చెక్కు క్లియర్

గతంలో బ్యాంక్‌కు వెళ్లి చెక్కు డిపాజిట్ చేసిన రెండు రోజులకు డబ్బులు జమ అయ్యేవి. కానీ తొలి దశలో చెక్కు డిపాజిట్ చేసిన కొన్ని గంటల్లోనే క్లియర్ చేసేలా ఆర్బీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇక రెండో దశలో కేవలం మూడు గంటల్లోనే చెక్కు క్లియర్ చేసే నిర్ణయాన్ని 2026 జనవరి 3 నుంచి అమల్లోకి తీసుకురావాలని ఆర్బీఐ తొలుత నిర్ణయించింది. కానీ తొలి దశ అమల్లో చాలా సమస్యలు బ్యాంకులు ఎదుర్కొవడంతో రెండో దశ అమలు చేసేందుకు సమయం ఇవ్వాలని ఆర్బీఐను బ్యాంకులు కోరాయి. రెండో దశను అమలు చేయాలంటే తమ కార్యకలాపాలను మార్చుకోవాల్సి ఉంటునది, అందుకే గడువు ఇవ్వాలని కోరాయి. దీంతో రెండో దశ అమలును నిరవధింగా వాయిదా వేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. కొత్త ఏడాది ప్రారంభంలోనే మూడు గంటల్లోనే చెక్కు క్లియర్ చేసే సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఆర్బీఐ నిర్ణయంతో నిరాశ చెందుతున్నారు.

చెక్ ట్రాన్సక్షన్ సిస్టమ్‌లో మార్పులు

ఆర్బీఐ గతంలో తెచ్చిన రూల్ ప్రకారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చెక్కుల ప్రెజెంటేషన్ సెషన్ ఉంటుంది. ఇక నిర్ధారణ సెషన్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. సాయంత్రం 7 గంటల్లోపు బ్యాంకులను చెక్కులను నిర్ధారించాలి. దీని వల్ల చెక్కు అందజేసిన కొన్ని గంటల్లోనే ప్రాసెస్ చేస్తున్నారు. దీని వల్ల తర్వాతి రోజు చెక్కుల క్లియరింగ్‌కు సంబంధించి బ్యాంకులకు ఒత్తిడి తగ్గుతుంది.