
ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ప్రతీఒక్క ఉద్యోగికి ఈపీఎఫ్ అకౌంట్ అనేది ఉంటుంది. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్‌ల ప్రకారం ఏ రంగంలో పనిచేసే ఉద్యోగికైనా పీఎఫ్ అకౌంట్ తప్పనిసరి చేసింది. గిగ్ కార్మికులకు కూడా ఆర్ధిక భరోసా కల్పించేందుకు ఈ సదుపాయం కల్పించాలని సూచించింది. ఇక పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. పీఎఫ్ అకౌంట్‌లోని బ్యాలెన్స్ నిల్వలపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ ప్రకటిస్తూ ఉంటుంది. ప్రతీ ఏడాది వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. దాదాపు 9 శాతం వరకు బ్యాలెన్స్ మొత్తంపై వడ్డీ ఇస్తూ ఉంటుంది. అయితే ఉద్యోగం మానేసినా లేదా మారినా పీఎఫ్ వడ్డీ ఆగిపోతుందా? అనే అనుమానం చాలామందికి ఉంటుంది.
ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం.. ఉద్యోగం మానేసినా లేదా వేరే ఉద్యోగం మారినా పీఎఫ్ బ్యాలెన్స్‌పై కేంద్రం ఇచ్చే వడ్డీ మాత్రం ఆగదు. మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంటే.. అంత మొత్తంపై యథావిధిగా వడ్డీ జమ అవుతూ ఉంటుంది. మీరు పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తం విత్ డ్రా చేసుకునేవరకు వడ్డీ కొనసాగుతూ ఉంటుంది. పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకోకపోతే 58 ఏళ్లు నిండేంతవరకు వడ్డీ కొనసాగుతూ ఉంటుంది. ఒకవేళ పీఎఫ్ అకౌంట్‌కు మూడేళ్ల పాటు ఎలాంటి కాంట్రిబ్యూషన్స్‌ను జరగకపోతే అకౌంట్ ఇన్ అపరేటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా అయినా మీకు వడ్డీ మాత్రం జమ అవుతుంది.
ప్రతీ ఆర్ధిక సంవత్సరానికి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటుంది. తగ్గించడం లేదా పెంచడం లాంటివి చేస్తూ ఉంటుంది. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీని నిర్ణయించింది. ఇక 2025-26 సంవత్సరానికి ఇంకా వడ్డీ రేట్లు ప్రకటించలేదు. ఫిబ్రవరిలో కేంద్రం ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ఈ సారి వడ్డీ రేటును పెంచే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభపరిణామంగా చెప్పవచ్చు.