NPS Vatsalya: పిల్లల కోసం సూపర్‌ స్కీమ్‌! విత్‌డ్రా రూల్స్‌.. ప్రయోజనాలు ఇవే!

కేంద్ర ప్రభుత్వం NPS వాత్సల్య పథకాన్ని 2024 జూలై 23న ప్రారంభించింది. మైనర్ పిల్లల ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేయడానికి, పొదుపు అలవాట్లను ప్రోత్సహించడానికి ఇది రూపొందించబడింది. రూ.250తో ఖాతా తెరవవచ్చు. 18 ఏళ్లు నిండగానే NPS టైర్‌ 1గా మారుతుంది.

NPS Vatsalya: పిల్లల కోసం సూపర్‌ స్కీమ్‌! విత్‌డ్రా రూల్స్‌.. ప్రయోజనాలు ఇవే!
Nps Vatsalya

Updated on: Apr 16, 2026 | 3:52 PM

పిల్లల భవిష్యత్ ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన NPS వాత్సల్య పథకం, చిన్న వయసులోనే పొదుపు అలవాట్లను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించనుంది. 2024 జూలై 23న ప్రారంభమైన ఈ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ రూపొందించింది. దీని ప్రధాన లక్ష్యం, పిల్లల పేరుతో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టి, భవిష్యత్తులో వారికి ఆర్థిక భద్రతను కల్పించడం. ఈ పథకం కింద భారత పౌరులైన 18 సంవత్సరాల లోపు మైనర్లందరూ ఖాతా తెరవడానికి అర్హులు. పిల్లల పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఖాతాను ప్రారంభించి నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో మైనరే ఏకైక లబ్ధిదారుడిగా ఉండేలా పథకం రూపుదిద్దుకుంది.

కనీసంగా రూ.250తో ఖాతా ప్రారంభించవచ్చు, అలాగే వార్షిక కనీస సహకారం కూడా అదే. గరిష్ట పరిమితి లేకపోవడం ప్రత్యేకత. తల్లిదండ్రులతో పాటు బంధువులు, స్నేహితులు కూడా ఈ ఖాతాకు విరాళాల రూపంలో డబ్బు జమ చేయవచ్చు. పిల్లవాడు 18 ఏళ్లు నిండగానే ఈ ఖాతా ఆటోమేటిక్‌గా నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ టైర్‌ 1గా మారుతుంది. దీంతో కొత్త ఖాతా తెరవాల్సిన అవసరం లేకుండా, దీర్ఘకాలికంగా కాంపౌండింగ్ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఖాతాదారుడు విద్య, వైద్య అవసరాలు వంటి ప్రత్యేక కారణాల కోసం 25 శాతం వరకు పాక్షిక ఉపసంహరణ చేసుకునే వీలుంది. నిబంధనల ప్రకారం 18 ఏళ్లలోపు రెండుసార్లు, అలాగే 18 నుండి 21 ఏళ్ల మధ్య మరో రెండుసార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఖాతాదారుడు మేజర్ అయిన తర్వాత కొత్తగా KYC పూర్తి చేయడం తప్పనిసరి. 21 సంవత్సరాల వయస్సు వరకు ఈ పథకంలో కొనసాగవచ్చు లేదా రెగ్యులర్ NPSకు మారవచ్చు. మొత్తం డిపాజిట్ రూ.8 లక్షల కంటే తక్కువగా ఉంటే పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ అది దాటితే కొంత భాగాన్ని పెన్షన్ కోసం వినియోగించాల్సి ఉంటుంది. పెట్టుబడి ఎంపికల పరంగా కూడా ఈ పథకం సౌలభ్యాన్ని అందిస్తుంది. గరిష్టంగా 75 శాతం వరకు ఈక్విటీలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. యాక్టివ్ ఛాయిస్ ద్వారా సంరక్షకుడు పెట్టుబడి కేటాయింపులను స్వయంగా నిర్ణయించవచ్చు. లేకపోతే ఆటో ఛాయిస్ ద్వారా వయస్సును ఆధారంగా చేసుకుని లైఫ్ సైకిల్ ఫండ్‌లో పెట్టుబడులు ఆటోమేటిక్‌గా కేటాయించబడతాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us