NPS Swasthya: కొత్త పెన్షన్‌ స్కీమ్‌ NPS స్వస్థ్య గురించి తెలుసా? ఇది ఎవరికోసమంటే?

పీఎఫ్ఆర్డీఏ 'NPS స్వస్థ్య' పథకాన్ని ప్రవేశపెట్టింది. పదవీ విరమణ తర్వాత పెరుగుతున్న ఆరోగ్య ఖర్చుల నుండి రక్షణ కల్పించే లక్ష్యంతో ఈ పథకం రూపొందించబడింది. ఇది NPSలో భాగంగా, పొదుపులను ఆరోగ్య సంరక్షణతో అనుసంధానిస్తుంది. ఈ స్కీమ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

NPS Swasthya: కొత్త పెన్షన్‌ స్కీమ్‌ NPS స్వస్థ్య గురించి తెలుసా? ఇది ఎవరికోసమంటే?
Nps Swasthya

Updated on: Apr 09, 2026 | 12:57 PM

దేశంలో పెరుగుతున్న ఆరోగ్య ఖర్చులను దృష్టిలో ఉంచుకుని PFRDA (పెన్షన్ ఫండ్ రేగులటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) ‘NPS స్వస్థ్య’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. పదవీ విరమణ కోసం పొదుపులను ఆరోగ్య సంరక్షణ అవసరాలతో అనుసంధానించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఈ పథకం ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్’ (PoC) దశలో అమలులో ఉంది. అంటే పరిమిత స్థాయిలో ప్రయోగాత్మకంగా అమలు చేసి, దాని సాధ్యాసాధ్యాలను అంచనా వేయనున్నారు.

ఇప్పటికే ఉన్న NPS (నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌)లో భాగంగా ఈ పథకం రూపొందించారు. వృద్ధాప్యంలో పెరుగుతున్న వైద్య ఖర్చులు వ్యక్తుల పొదుపులను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో, ఈ సమస్యకు సమగ్ర పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో PFRDA ముందుకొచ్చింది. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత ఆరోగ్య ఖర్చులు పెరిగే అవకాశమున్నందున, ముందుగానే ఆర్థికంగా సిద్ధం కావడంలో ఇది సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ పథకం అమలుకు పలు సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. మేడి అసిస్ట్ హెల్త్కారే సర్వీసెస్ టెక్నాలజీ భాగస్వామిగా వ్యవహరిస్తుండగా, CAMS KRA కేవైసీ ప్రక్రియను నిర్వహిస్తుంది. అలాగే టాటా పెన్షన్‌ ఫండ్‌, యాక్సిస్‌ పెన్షన్‌ ఫండ్‌ నిధుల నిర్వహణ బాధ్యతలు చేపట్టాయి. ఆరోగ్య బీమా టాప్-అప్ కవరేజ్‌ను ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అందిస్తోంది.

ఈ పథకం కింద భారతీయ పౌరులందరికీ చేరే అవకాశం ఉంది. NPS ఖాతా తప్పనిసరి కాగా, పెట్టుబడులపై ఎటువంటి పరిమితి లేదు. ముఖ్యంగా ఆరోగ్య అవసరాల కోసం చందాదారులు తమ నిధుల్లో 25 శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం కల్పించడం ఈ పథకంలోని ప్రత్యేకతగా నిలుస్తోంది. కనీసం రూ.50,000 జమ చేసిన తర్వాతే ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. దేశంలో ఆరోగ్య వ్యయం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో 2026 నాటికి ఇది 14 శాతం వరకు చేరే అవకాశముందని అంచనాలు సూచిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ‘NPS స్వస్థ్య’ వంటి పథకాలు భవిష్యత్తులో వృద్ధాప్య భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక పాత్ర పోషించే అవకాశముంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us