తండ్రి బతికుండగా ఆస్తిలో వాటా అడిగే హక్కు కొడుకులకు ఉండదా..? హైకోర్టు సంచలన తీర్పు..

తండ్రి ఆస్తిలో పుట్టుకతోనే హక్కు వస్తుందని భావిస్తున్నారా? అయితే మీరు ఈ కీలక చట్టపరమైన విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. తండ్రి బతికుండగా ఆయన ఆస్తిలో భార్యకు గానీ, కొడుకులకు గానీ ఎలాంటి వాటా అడిగే హక్కు లేదంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పూర్వీకుల ఆస్తిపై హిందూ వారసత్వ చట్టం ఏం చెబుతోంది? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తండ్రి బతికుండగా ఆస్తిలో వాటా అడిగే హక్కు కొడుకులకు ఉండదా..? హైకోర్టు సంచలన తీర్పు..
No Share For Wife And Sons In Property During Father Lifetime

Updated on: Oct 29, 2026 | 4:19 PM

తండ్రి జీవించి ఉన్నంత కాలం ఆయన అధీనంలో ఉన్న ఆస్తిలో భార్య, కొడుకులు ఎటువంటి వాటాను చట్టబద్ధంగా డిమాండ్ చేయలేరని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. భర్త వద్ద ఉన్న పూర్వీకుల ఆస్తిలో వాటా కోరుతూ ఓ మహిళ, ఆమె ఇద్దరు కొడుకులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. హిందూ వారసత్వ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పుట్టుకతోనే ఆస్తిపై హక్కు లభించే పాత సిద్ధాంతం వర్తించదని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ కుటుంబంలో పూర్వీకుల భూమి పంపకాలపై వివాదం చెలరేగింది. తన తండ్రి పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని తమకు వాటా ఇవ్వకుండా అమ్ముతున్నాడని ఆరోపిస్తూ భార్య, ఇద్దరు కొడుకులు సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఆ భూమిపై తమకు యాజమాన్య హక్కులు కల్పించాలని, ఆస్తిని విక్రయించకుండా శాశ్వత నిషేధాజ్ఞలు ఇవ్వాలని కోరారు. అయితే కేసు విచారణలో ఉండగానే సదరు వ్యక్తి 2011లో కొంత భాగాన్ని వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశాడు. దీంతో ఆ సేల్ డీడ్‌ను రద్దు చేయాలని పిటిషనర్లు కోర్టును అభ్యర్థించారు.

దిగువ కోర్టుల తీర్పును సమర్థించిన హైకోర్టు

ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన ట్రయల్ కోర్టు మే 2012లోనే కొట్టివేసింది. తండ్రి బతికుండగా కుమారులు, భార్య ఆస్తిలో వాటా కోరలేరని స్పష్టం చేసింది. అనంతరం 2015లో అదనపు జిల్లా న్యాయమూర్తి కూడా ఇదే తీర్పును సమర్థించారు. దీంతో ఆ తల్లి, కుమారులు మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ ఆశిష్ శ్రోతీ ధర్మాసనం విచారణ చేపట్టింది.

భార్య కో పార్ట్‌నర్ కాదు.. కుమారుడికి ఆ హక్కు ఉండదు

విచారణ సందర్భంగా జస్టిస్ ఆశిష్ శ్రోతీ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ చట్టం ప్రకారం భర్త ఆస్తిలో భార్య సహభాగస్వామి కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ వాదనను పరిగణనలోకి తీసుకున్నా కేవలం కుమారులే ఆ కేటగిరీలోకి వస్తారని పేర్కొంది. అయినప్పటికీ తండ్రి విభజన ద్వారా పొందిన ఆస్తి ఆయన స్వార్జిత ఆస్తి కిందకే వస్తుందని, కాబట్టి ఆయన బతికుండగా ఆస్తి పంపకాలు కోరే హక్కు పిల్లలకు సైతం ఉండదని తేల్చిచెప్పింది.

సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఆదేశాలు

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో ఉత్తమ్ వర్సెస్ సౌభాగ్ సింగ్ కేసులో ఇచ్చిన తీర్పును హైకోర్టు గుర్తుచేసింది. 1956లో హిందూ వారసత్వ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత పుట్టుకతోనే సంక్రమించే హక్కు పాత విధానంలో వర్తించదని ధర్మాసనం వివరించింది. పూర్వీకుల ఆస్తి అయినప్పటికీ, తండ్రి జీవించి ఉండగా కుమారుడు విభజనను డిమాండ్ చేయలేడని, తండ్రి మరణానంతరం మాత్రమే ఆ హక్కు సంక్రమిస్తుందని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us