
సాధారణంగా క్రెడిట్ కార్డులను ఉపయోగించి వ్యాపారుల దగ్గర వస్తువులను కొనుగోలు చేస్తాం. ఆ వస్తువు ధరను క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తాం. అయితే వ్యాపారులు మాత్రం దానిపై 2 నుంచి 3 శాతం మర్చండ్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే మీరు వంద రూపాయల వస్తువును కొనుగోలు చేస్తే.. వ్యాపారులు 2 నుంచి 3 రూపాయలు ఎండీఆర్ చెల్లించాలి. అయితే కొందరు వ్యాపారులు ఎండీఆర్ మొత్తాన్ని కూడా కొనుగోలుదారుల నుంచే వసూలు చేస్తారు. కానీ యూపీఐ విధానంలో జరిపే పేమెంట్లకు ఇప్పటి వరకూ ఎండీఆర్ లేదు. కానీ అధిక మొత్తంలో జరిగే లావాదేవీలపై ఎండీఆర్ విధిస్తారనే వార్తలు బాగా వినిపించాయి. అయితే ఇప్పట్లో అలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదని సమాచారం.
డిజిటల్ చెల్లింపులకు ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహన్ని ఇస్తోంది. అయితే నిర్ధిష్ట పరిమితికి మించి జరిగిన లావాదేవీలపై ఎండీఆర్ వసూలు చేయాలనే అంశంపై చర్చలు జరిగిన విషయం వాస్తవమే. కానీ దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. క్రెడిట్ కార్డులపై అమలు చేస్తున్న ఎండీఆర్ ను యూపీఐ లావాదేవీలతో పాటు రూపే కార్డుకు వర్తింపజేయాలన్న ప్రతిపాదనలు కూడా వచ్చాయి. యూపీఐ లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎండీాఆర్ ను వర్తింపజేయాలనే డిమాండ్ పెరుగుతోంది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) తెలిపిన వివరాల ప్రకారం.. మన దేశంలోె డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విపరీతంగా పెరిగిపోయింది. ప్రజలు పెద్ద ఎత్తున చెల్లింపులు జరుపుతున్నాయి. 2025 ఏప్రిల్ లో యూపీఐ ద్వారా రూ.20 లక్షల కోట్లకు పైగా విలువైన 14 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. దీంతో ఎండీఆర్ రేటుపై చర్చ జరిగింది. సాధారణ లావాదేవీలను మినహాయించి, నిర్దిష్ట పరిమితికి మించిన వాటిపై వసూలు చేయాలనే వాదనలు పెరిగాయి. కానీ వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో యూపీఐ యూజర్లకు ఎటువంటి ఇబ్బంది లేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..