ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఫారం 143 గురించి తెలుసా? కొత్తగా వచ్చిన ఈ ఫారం దేనికంటే?

కేంద్ర ప్రభుత్వం TCS నివేదనను సరళీకృతం చేస్తూ కొత్త ఫారం 143ను ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 1 నుండి పాత ఫారం 27EQ స్థానంలో ఇది అమల్లోకి వచ్చింది. పన్ను ప్రక్రియలను సులభతరం చేయడం, ఫైలింగ్‌లో తప్పులను తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం. ఆటో-ఫిల్ వంటి సాంకేతిక ఫీచర్లతో ఫారం 143 పారదర్శకతను, వేగాన్ని పెంచుతుంది.

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఫారం 143 గురించి తెలుసా? కొత్తగా వచ్చిన ఈ ఫారం దేనికంటే?
Income Tax

Updated on: Apr 16, 2026 | 5:16 AM

ఆదాయపు పన్ను విధానాలను మరింత సరళీకృతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ తాజాగా మూలం వద్ద వసూలు చేసే పన్ను (TCS) నివేదికల కోసం కొత్త ఫారం ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 1 నుంచి పాత ఫారం 27EQ స్థానంలో ఫారం 143 అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. పాత ఫారం 27EQ స్థానంలో కొత్త ఫారం 143 అమల్లోకి వచ్చింది. ఇది కలెక్టర్ దాఖలు చేసే TCS త్రైమాసిక నివేదిక అని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. పన్ను ప్రక్రియలను సులభతరం చేయడం, ఫైలింగ్‌లో జరిగే పొరపాట్లను తగ్గించడం లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు తెలిపింది.

కొత్తగా ప్రవేశపెట్టిన ఫారం 143 ఒక త్రైమాసిక నివేదిక. వస్తువుల అమ్మకాలు, స్క్రాప్, మద్యం విక్రయాలు, విదేశీ టూర్ ప్యాకేజీలు, విదేశీ చెల్లింపులు వంటి లావాదేవీలపై TCS వసూలు చేసే వారు ఈ ఫారంను తప్పనిసరిగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా రిపోర్టింగ్‌ను మరింత స్పష్టంగా, ప్రామాణికంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫారం నిర్మాణంలో కూడా మార్పులు చేశారు. దీనిని మూడు భాగాలుగా భాగం A, భాగం B, అనుబంధ పత్రంగా విభజించారు. భాగం Aలో కలెక్టర్ వివరాలు నమోదు చేయగా, భాగం Bలో వసూలు చేసిన పన్ను వివరాలు ఉంటాయి. అనుబంధంలో ప్రతి లావాదేవీకి సంబంధించిన పాన్, పన్ను వివరాలు వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది.

సాంకేతికతను వినియోగిస్తూ, ఆటో-ఫిల్, డ్రాప్‌డౌన్ ఆప్షన్లు, రియల్-టైమ్ ఎర్రర్ చెక్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో చేర్చారు. దీంతో ఫైలింగ్ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు తప్పులు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అలాగే సర్‌చార్జ్, సెస్ వంటి పన్ను భాగాలను ఒకే కాలమ్‌లో విలీనం చేయడం ద్వారా రిపోర్టింగ్‌ను సులభతరం చేశారు. కొత్త ఫారం అమల్లోకి వచ్చినప్పటికీ, త్రైమాసిక ఫైలింగ్ గడువులు యథాతథంగా కొనసాగుతాయి. అయితే 2025–26 ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసికానికి పాత ఫారం 27EQనే వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. తదుపరి ఆర్థిక సంవత్సరం నుంచి అన్ని ఫైలింగ్‌లకు ఫారం 143 ఉపయోగించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us