Central Government: ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలా..? జూన్ 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్..

ఇంటిపై సోలార్ పవర్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే. జూన్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు రానున్నాయి. దీంతో వీటి ధరలు పెరగనున్నాయి. కానీ కేంద్రం ఇచ్చే సబ్సిడీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

Central Government: ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలా..? జూన్ 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్..
Solar

Updated on: May 27, 2026 | 12:43 PM

కరెంట్ బిల్లు తగ్గించుకునేందుకు ఇటీవల ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని వల్ల కరెంట్ బిల్లు ఖర్చు తగ్గుతుంది. వేసవి కాలంలో విద్యుత్ కొతలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఉక్కబోతతో ప్రజలు అవస్థలు పడుతూ ఉంటారు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే అలాంటి ఇబ్బంది ఉండదు. 24 గంటల పాటు ఇంటికి విద్యుత్ సరఫరా ఉంటుంది. ప్రభుత్వం సబ్సిడీలు కూడా అందిస్తుండటంతో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. అయితే జూన్ 1వ తేదీ నుంచి సోలార్ పరిశ్రమకు కేంద్రం కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోలనుకునేవారికి మరింత భారం పడనుంది.

కొత్త నిబంధనలు ఇవే..

ఇళ్లల్లో వాడే సోలార్ ప్యానెళ్లకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు వీటిని తప్పనిసరిగా ప్రభుత్వ ఆమోదిత జాబితా (ALMM జాబితా-I) ప్రకారం ధృవీకరించబడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నిబంధనను మరింత కఠినతరం చేసింది. సోలార్ ప్యానెళ్లలోని చిన్న సోలార్ సెల్స్ కూడా తప్పనిసరిగా ప్రభుత్వ ఆమోదిత జాబితా (జాబితా-II)లో చేర్చాలి. జూన్ 1వ తేదీ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. నాణ్యత లేని విదేశీ పరికరాల దిగుమతిని అరికట్టేందుకు ఈ నిర్ణయం కేంద్రం తీసుకుంది. దీని వల్ల సోలార్ ప్యానెళ్ల ధరలు పెరగనున్నాయి. 1 kW సౌర వ్యవస్థను ఏర్పాటు చేయడానికి గతంలో కంటే అదనంగా రూ.3 వేలు ఖర్చు అయ్యే అవకాశముందని చెబుతున్నారు. ఇక 2 kW వ్యవస్థకు రూ.6 వేలు, 3 kW వ్యవస్థకు రూ.9 వేలు ఖర్చు కావొచ్చు.

సబ్సిడీలు కొనసాగింపు

అయితే సోలార్ ప్యానెళ్ల ధరలు పెరిగినా.. పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద పేదలకు ప్రస్తుతం అందిస్తున్న సబ్సిడీ మాత్రం కొనసాగుతుంది. 1 కిలోవాట్‌కు రూ.30 వేలు, 2 కిలోవాట్‌లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల సిస్టమ్‌లకు రూ.78 వేల వరకు రాయితీలు కొనసాగుతాయి. నిబంధనలను మార్చడంతో కేంద్రం సబ్సిడీని కూడా నిలిపివేస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. కానీ ఇందులో ఎటువంటి నిజం లేదు. కేంద్రం ఎప్పటిలాగే సోలార్ ఏర్పాటు చేసుకునేవారికి సబ్సిడీ ఇవ్వనుంది. ఇక కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు కూడా సబ్సిడీలు అందిస్తున్నాయి.  టాప్ అప్ పేరుతో సబ్సిడీలు ఇస్తున్నాయి. నిబంధనలు మారినా ఇవి మాత్రం కొనసాగుతాయి.

Follow Us