
ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్ఎండీసీ ఏప్రిల్‌లో ఇనుప ఖనిజం ఉత్పత్తిలో 15 శాతం పెరుగుదల, ఖనిజ అమ్మకాల్లో 3 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు నివేదించింది. ఇటీవల విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎన్ఎండీసీ ఏప్రిల్‌లో 4 మిలియన్ టన్నుల (ఎంఎన్‌టీ) ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసిందని , గత ఏడాది ఇదే నెలలో ఇది 3.48 ఎంఎన్‌టీ గా ఉందని తెలిపింది. ఎన్ఎండీసీ గత నెలలో 3.63 ఎంఎన్‌టీ ఇనుప ఖనిజాన్ని విక్రయించింది. ఇది ఏప్రిల్ 2024లో 3.53 ఎంఎన్‌టీగా ఉంది. ఈ కొత్త రికార్డులపై ఎన్ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ మాట్లాడుతూ ఏప్రిల్‌లో రికార్డు స్థాయి పనితీరుతో ప్రధాన ఇనుప ఖనిజ గనులైన కిరండుల్, బచేలి, దోనిమలై ద్వారా వరుసగా 12 శాతం, 4 శాతం, 88 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు.
ముఖ్యంగా 2030 నాటికి 100 ఎంటీ మైనింగ్ కంపెనీగా మారాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో పని చేస్తున్నట్లు ముఖర్జీ స్పష్టం చేశారు. ఎన్ఎండీసీ కంపెనీ పెల్లెట్ ఉత్పత్తి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 0.23 లక్షల టన్నులకు పెరిగింది. ఇది 2018 ఏప్రిల్ నెలలో నెలకొల్పిన మునుపటి రికార్డును అధిగమించింది. భారత ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ భారతదేశంలో అతిపెద్ద ఇనుప ఖనిజం ఉత్పత్తి సంస్థగా ఉంది.
అయితే ఎన్ఎండీసీ నుంచి విడిపోయిన ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్) మార్చిలో ఉత్పత్తి చేసిన 2,11,978 టన్నుల నుండి ఏప్రిల్‌లో దాని హాట్ మెటల్ ఉత్పత్తిలో నెలవారీ 8.5 శాతం వృద్ధిని నమోదు చేసి 2,30,111 టన్నులకు చేరుకుందని తెలిపింది. భారతదేశంలో అతి చిన్న స్టీల్ యూనిట్‌గా ఉన్న చత్తీస్‌గఢ్‌లోని ఎన్ఎస్ఎల్‌కు సంబంధించి 3 మిలియన్ టన్నుల నగర్ స్టీల్ ప్లాంట్‌ను రూ.24,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి