IRCTC: ఐఆర్‌సీటీసీకి భారీ షాక్.. రైల్ నీర్ కుంభకోణంలో కీలక మలుపు

IRCTC: ఆర్టీఐ దరఖాస్తు వ్యవహారాన్ని వెంటనే పునఃసమీక్షించాలని కేంద్ర సమాచార కమిషన్ తాజాగా ఐఆర్సీటీసీని ఆదేశించింది. పాత సమాధానాన్ని పక్కనపెట్టి కొత్తగా, స్పష్టమైన కారణాలతో సమాధానం ఇవ్వాలని డెడ్‌లైన్ విధించింది. ఈ సంచలన పరిణామంతో రైల్వే టెండర్ల వ్యవహారాల్లో దాగిన భారీ అవినీతి త్వరలోనే బట్టబయలు అయ్యే అవకాశం కనిపిస్తోంది..

IRCTC: ఐఆర్‌సీటీసీకి భారీ షాక్.. రైల్ నీర్ కుంభకోణంలో కీలక మలుపు
Irctc Rail Neer Scam

Edited By:

Updated on: Apr 07, 2026 | 4:50 PM

IRCTC Rail Neer Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రైల్ నీర్ కుంభకోణం కేసులో కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వివరాలు ఇచ్చేందుకు నిరాకరించిన ఐఆర్సీటీసీ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రభుత్వ టెండర్ల వ్యవహారంలో అక్రమాలు చేసిన కంపెనీల వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడంపై సీఐసీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేవలం చట్ట నిబంధనలను సాకుగా చూపి కీలక సమాచారాన్ని ప్రజల నుంచి కప్పిపుచ్చడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని తేల్చి చెప్పింది. గతంలో రైల్ నీర్ కుంభకోణం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ స్కామ్‌లో చిక్కుకున్న కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గతంలోనే చీటింగ్, క్రిమినల్ కుట్ర లాంటి తీవ్రమైన కేసులు నమోదు చేసింది. ఆ కేసుల వివరాలను సదరు కంపెనీలు టెండర్ల సమయంలో ఐఆర్సీటీసీకి వెల్లడించాయా లేదా అని తెలుసుకోవడానికే ఒక పౌరుడు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశారు.

ఈ దరఖాస్తుపై ఐఆర్సీటీసీ అధికారులు వింత వాదనను తెరపైకి తెచ్చారు. ట్రేడ్ సీక్రెట్స్, వ్యాపార రహస్యాల పేరుతో ఆ వివరాలను బయటపెట్టలేమని పూర్తిగా చేతులెత్తేశారు. ఈ సమాచారం బయటకు వస్తే ఆయా కంపెనీల వ్యాపార ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని కుంటిసాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఐఆర్‌సీటీసీ అధికారుల ఈ నిర్ణయాన్ని కేంద్ర సమాచార కమిషన్ తీవ్రంగా తప్పుబట్టింది. పారదర్శకత అనేది ఏ ప్రభుత్వ సంస్థకైనా అత్యంత కీలకమని గట్టిగా చురకలు అంటించింది. ప్రజాధనం, ప్రభుత్వ టెండర్లతో ముడిపడిన వ్యవహారాల్లో జవాబుదారీతనం తప్పనిసరని కమిషన్ స్పష్టం చేసింది. సమాచారాన్ని ఎందుకు నిరాకరిస్తున్నారో దానికి తగిన బలమైన కారణాలు చూపాల్సిన బాధ్యత అధికారులదేనని సీఐసీ గుర్తుచేసింది.

ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8ను సాకుగా చూపి బాధ్యతల నుంచి తప్పుకోవడం సరైన విధానం కాదని హితవు పలికింది. అడిగిన సమాచారం ఇస్తే నిజంగానే జరిగే నష్టమేంటో నిరూపించాల్సిన పూర్తి బాధ్యత సంస్థపైనే ఉందని స్పష్టం చేసింది. సామాన్యులు కోరిన సమాచారాన్ని దాచడం ద్వారా పరోక్షంగా అవినీతిపరులను కాపాడుతున్నారనే అనుమానాలకు ఐఆర్సీటీసీ తావిచ్చినట్లయింది. సెక్షన్ 120బీ, 420 కింద సాక్షాత్తూ ఈడీ కేసులు ఎదుర్కొంటున్న కంపెనీలకు మద్దతుగా ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఇలా నిలవడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆర్టీఐ దరఖాస్తు వ్యవహారాన్ని వెంటనే పునఃసమీక్షించాలని కేంద్ర సమాచార కమిషన్ తాజాగా ఐఆర్సీటీసీని ఆదేశించింది. పాత సమాధానాన్ని పక్కనపెట్టి కొత్తగా, స్పష్టమైన కారణాలతో సమాధానం ఇవ్వాలని డెడ్‌లైన్ విధించింది. ఈ సంచలన పరిణామంతో రైల్వే టెండర్ల వ్యవహారాల్లో దాగిన భారీ అవినీతి త్వరలోనే బట్టబయలు అయ్యే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us