
భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకోవడం ప్రతీ ఒక్కరూ చేసే పనే. తాము సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవింగ్ చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఇందుకోసం ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎల్‌ఐసీ గురించి. భారతదేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఎల్‌ఐసీ ఎన్నో రకాల పథకాలను అందిస్తోంది. ఇలాంటి వాటిలో జీవన్ ప్రగతి పాలసీ ఒకటి. ఇంతకీ పాలసీ ఏంటి.? ఇందులో ఎంత పెట్టుబడి పెట్టాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఎల్‌ఐసీ జీవన్ ప్రగతి ప్లాన్‌లో ఇన్వెస్టర్ల రిస్క్ కవర్ ప్రతీ ఐదేళ్లకు పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ పాలసీ హోల్డర్ మధ్యలో మరణిస్తే బీమా మొత్తం చెల్లిస్తారు. జీవన్ ప్రగతి పాలసీ కాలపరిమితి కనిష్టంగా 12 సంవత్సరాలు, గరిష్టంగా 20 ఏళ్లుగా ఉంటుంది. 12 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లు ఈ పథకంలో చేరొచ్చు. ఈ పాలసీలో కనీస మొత్తం రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్టంగా ఎలాంటి పరిమితి లేదు. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ. 2లక్షల పాలసీని కొనుగోలు చేశారనుకుంటే.. వారి డెత్ బెనిఫిట్ మొదటి ఐదేళ్ల వరకు సాధారణంగానే ఉంటుంది. అనంతరం 6 నుంచి 10 ఏళ్ల వరకు కవరేజీ రూ. 2.5 లక్షలు ఉంటుంది. ఇక 10 నుంచి 15 ఏళ్లలో కవరేజీ రూ. 3 లక్షల వరకు పెరుగుతుంది.
కాగా ఈ పథకంలో ఒక వ్యక్తి రోజుకు రూ. 200 ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. ఇలా చేస్తే నెలకు రూ. 6000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇలా డిపాజిట్ చేస్తూపోతే ఏడాదికి రూ. 72,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇలా 20 ఏళ్లు పెట్టుబడి పెడుతూ వెళ్తే మొత్తం పెట్టుబడి రూ. 14,40,000 అవుతుంది. అన్ని ప్రయోజనాలతో సహా మీరు మొత్తం రూ. 28 లక్షలు పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..