ఊహించని ఆర్థిక అవసరాలు ఏర్పడినప్పుడు, మెడికల్ ఎమర్జెనీ తలెత్తినప్పుడు డబ్బును సర్ధుబాటు చేయడం చాలా కష్టం. ఈ సమయంలో చాలా మందికి లోన్స్ తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారుతుంది. అయితే, ఎలాంటి లోన్స్ తీసుకోవాలనే విషయంలో మాత్రం చాలా మందికి ఎన్నో అనుమానాలుంటాయి. కొంతమంది బయట అధిక వడ్డీకి అప్పులు చేస్తుంటారు. మరికొంతమంది బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అందించే వివిధ రుణాల వైపు మొగ్గు చూపిస్తుంటారు. లోన్స్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సెక్యూర్డ్ లోన్, రెండొది అన్ సెక్యూర్డ్ లోన్. రుణం తీసుకున్నందుకు ఏదైనా ఆస్తి, బంగారం తాకట్టు పెడితే వాటిని సెక్యూర్డ్ లోన్స్ అంటారు. వీటిలో రుణ మొత్తం ఎక్కువుగా, వడ్డీ తక్కువుగా ఉంటుంది. చాలా మంది సెక్యూర్డ్ లోన్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. గోల్డ్‌లోన్‌లో బంగారు ఆభరణాలు లేదా గోల్డ్ కాయిన్స్ తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చు. అదే ఆస్తులపై రుణం తీసుకుంటే వాటి పత్రాలను తనఖా పెట్టాల్సి ఉంటుంది.
గోల్డ్ లోన్ విషయంలో, తాకట్టు పెట్టిన బంగారం మార్కెట్ విలువ ఆధారంగా రుణం మొత్తాన్ని నిర్ణయిస్తారు. అదే సమయంలో స్టోన్స్ ఉంటే వాటి విలువను లెక్కించరు. తయారీ ఛార్జీలను పరిగణలోకి తీసుకోరు. కేవలం బంగారం స్వచ్ఛత, ఆరోజు ఉన్న మార్కెట్ విలువను మాత్రమే లెక్కిస్తారు. మార్కెట్ విలువలో 75 శాతం వరకు రుణంగా పొందవచ్చు. అదే ఆస్తిపై రుణం తీసుకుంటే ఆస్తి విలువలో 75 శాతం వరకు రుణంగా పొందవచ్చు. ఆస్తి కి సంబంధించి మార్కెట్ విలువ ఎక్కువుగా ఉంటే రుణం ఎక్కువ మొత్తంలో పొందే వీలుంటుంది.
బంగారం తాకట్టుపెట్టి తీసుకునే రుణంతో పోలిస్తే ఆస్తులు తనఖా పెట్టి తీసుకునే లోన్స్‌పై వడ్డీ రేటు తక్కువుగా ఉంటుంది. బంగారు రుణాలపై వడ్డీ రేట్లు సాధారణంగా 9 నుంచి 28 శాతం వరకు ఉంటాయి. దీనికి ప్రధాన కారణంగా బంగారం రేట్లు మార్కెట్‌లో స్థిరంగా ఉండవు. రోజురోజుకు హెచ్చు తగ్గులు ఉంటాయి. ప్రొపర్టీ తనఖా పెట్టి తీసుకునే రుణంపై వడ్డీ రేటు 9 నుంచి 12 శాతం వరకు ఉంటుంది.
బంగారు రుణాల విషయంలో చెల్లింపు కాల పరిమితి ఏడాది నుంచి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ కాల పరిమితి అనేది బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నియమ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. ఆస్తులపై తీసుకునే రుణం తిరిగి చెల్లించే వ్యవధి కనీసం ఏడాది నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది.
రుణాన్ని మంజూరు చేసేందుకు పట్టే సమయం చూసుకున్నట్లయితే ఆస్తులు తనఖా పెట్టి తీసుకునే రుణం కంటే గోల్డ్ లోన్ వేగంగా లభిస్తుంది. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు బంగారం విలువను లెక్కించిన వెంటనే రుణాలను మంజూరు చేస్తాయి. అదే బ్యాంకుల్లో తనఖా పెట్టిన ఆస్తి విషయంలో అనేక నియమ నిబంధనలను అనుసరించి ఫార్మాల్టీస్ పూర్తి చేయవలసి ఉంటుంది. అందుకే ఆస్తులపై రుణం పొందడానికి కొంత సమయం పడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..