
దేశంలో ఉద్యోగాల కల్పన రికార్డు స్థాయిలో పెరిగింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. జూన్ నెలలో 2.18 మిలియన్ల ఉద్యోగులు కొత్తగా యాడ్ అయ్యారు. ఇది ఏప్రిల్ 2018లో పే-రోల్ డేటా ట్రాకింగ్ ప్రారంభమైనప్పటి నుండి నమోదైన అత్యధిక సంఖ్య అని కార్మిక -ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది మే 2025లో నమోదైన 2.01 మిలియన్ల ఉద్యోగుల కంటే 8.9శాతం ఎక్కువ. గత ఏడాది జూన్ 2024తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో ఉద్యోగుల చేరిక 12.9 శాతం పెరిగింది. జూన్ 2025లో దాదాపు 1.06 మిలియన్ల కొత్త ఉద్యోగులు పీఎఫ్‌లో నమోదు చేసుకున్నారు. ఇది మే నెలతో పోలిస్తే 12.6శాతం అధికం. ఈ పెరుగుదలకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగుల ప్రయోజనాలపై అవగాహన పెరగడం, ఈపీఎఫ్‌వో కార్యక్రమాలు కారణమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
యువతలో వృద్ధి: జూన్‌లో చేరిన కొత్త సభ్యులలో 60.2శాతం మంది (0.64 మిలియన్లు) 18-25 సంవత్సరాల వయస్సు గలవారు. ఇది మే నెలతో పోలిస్తే 14.1శాతం అధికం. వ్యవస్థీకృత శ్రామిక శక్తిలోకి ప్రవేశిస్తున్న చాలామంది యువత, ముఖ్యంగా మొదటిసారి ఉద్యోగార్థులు ఉన్నారని ఇది సూచిస్తుంది.
మహిళా సభ్యులు: జూన్ నెలలో 4.7 లక్షల మంది మహిళా సభ్యులు, 3.0 లక్షల మంది కొత్త మహిళా సభ్యులు ఈపీఎఫ్‌వోలో చేరారు. ఇది జూన్ 2024తో పోలిస్తే 10.3శాతం, కొత్త సభ్యుల చేరిక 1.34శాతం పెరిగినట్లు సూచిస్తుంది. మహిళా సభ్యుల చేరికలో పెరుగుదల మరింత కలుపుకొని, వైవిధ్యభరితమైన శ్రామిక శక్తి వైపు మార్పును సూచిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రాష్ట్రాల వారీగా చూస్తే.. మొత్తం ఉద్యోగాల కల్పనలో మొదటి ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దాదాపు 61.5శాతం వాటాను కలిగి ఉన్నాయి. మహారాష్ట్ర ఒక్కటే ఈ నెలలో 20.03శాతం పే-రోల్‌ను జోడించింది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు 5శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి. పరిశ్రమల వారీగా చూస్తే, పాఠశాలలు, నిపుణుల సేవలు, భవన నిర్మాణ పరిశ్రమ, విశ్వవిద్యాలయాలు, కాలేజీలు వంటి రంగాలలో ఉద్యోగాల కల్పనలో గణనీయమైన వృద్ధి కనిపించింది. కాగా ఉద్యోగుల రికార్డులు నిరంతరం అప్‌డేట్ అవుతుంటాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..