
ఎంతగానో ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు కూత పెట్టేందుకు రెడీ అయింది. వందేభారత్ స్లీపర్ రైలు డిసెంబర్ చివరి నాటికి ఢిల్లీ నుంచి పట్నా మార్గంలో సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. 2019లో వందే భారత్ రైలు ప్రారంభమైనప్పటి నుంచి.. ప్రయాణికుల నుంచి బాగా ఆదరణ పొందుతోంది. దీంతో 100 వందే భారత్ రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది. ఈ వందే భారత్ స్లీపర్ రైలు బెంగళూరులోని బీఈఎంఎల్ ఫ్యాక్టరీలో తయారైంది.
ట్రయల్ రన్ కోసం డిసెంబర్ 12న నార్తర్న్ రైల్వేకు పంపనున్నారు. ఈ హైటెక్ రైలులో 16 కోచ్‌లు, 827 బెర్త్‌లు ఉంటాయి. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి.. కవచ్ భద్రతా వ్యవస్థతో తయారు చేశారు. రాత్రిపూట సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి హోటల్ లాంటి కంఫర్ట్ అందించనుంది. అత్యాధునిక సౌకర్యాలు, భద్రతపై దృష్టి పెట్టి స్లీపర్ రైలును రూపొందించారు. ఆటోమేటిక్ డోర్లు, బయో టాయిలెట్లు, సీసీటీవీ కెమెరాలు, రీడింగ్ లైట్లు, ప్రీమియం ఇంటీరియర్‌లు ఏర్పాటు చేశారు. గంటకు గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఈ రైలును వారానికి 6 రోజులు నడిచే అవకాశం ఉంది. పట్నాలోని రాజేంద్ర నగర్ టెర్మినల్ నుంచి సాయంత్రం బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం ఢిల్లీ చేరుకోనుంది.