
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో భారతీయ రైల్వే నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం రైళ్లను అప్‌గ్రేడ్ చేస్తున్న రైల్వేశాఖ.. ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైళ్లు అయిన వందే భారత్, వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే ఏడాదిలో దేశంలో తొలి హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్‌ను కూడా తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అహ్మదాబాద్-ముంబై హైస్పీడ్ రైలు కారిడార్‌లో తొలి బుల్లెట్ రైలు ప్రవేశపెట్టనున్నాయి. అయితే రైలుకు ఒక నిర్ణీత కాలపరిమితి ఉంటుంది. ఆ కాలపరిమితి తర్వాత బోగీలు, ఇంజిన్లను ఉపయోగించడం నిలిపివేస్తారు. కాలపరిమితి తర్వాత ఇంజిన్లు, బోగీలకు ఏం చేస్తారనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం.
కోచ్‌ల రకాన్ని బట్టి వాటికి కాలపరిమితిని రైల్వేశాఖ నిర్ణయిస్తుంది. నీలం రంగు ఐసీఎఫ్ కోచ్‌ల కాలపరిమితి 25 ఏళ్లుగా ఉండగా.. ఎరువు రంగు ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల నిర్ణీత కాలపరిమితి 30 నుంచి 35 ఏళ్లుగా ఉంది. ఇక డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్ల కాలపరిమితి 30 నుంచి 35 ఏళ్లుగా ఉంటుంది. ఈ కాలపరిమితి ముగిసిన తర్వాత బోగీలు, ఇంజిన్లను రైళ్లకు ఉపయోగించరు. అలా అని వాటిని వృధాగా వదిలేయరు. ఆ బోగీలు, కోచ్‌లను వేరే అవసరాల కోసం ఉపయోగిస్తారు. సర్వీస్ కాలం ముగిసిన తర్వాత ఆ కోచ్‌లను నిపుణుల బృందం పరిశీలీస్తుంది. వాటి దృఢత్వాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వేరే అవసరాల కోసం వినియోగించడంపై నిర్ణయం తీసుకుంటారు. బాగున్న కోచ్‌లను సరుకు రవాణా కోసం ఉపయోగిస్తారు. కోచుల్లోని సీట్లు, ఫ్యాన్లు, లైట్ల వంటి వాటిని తొలగించి సరుకు రవాణా బోగీలుగా మారుస్తారు. కార్లు, బైక్‌లు, ఇతర సరుకు రవాణా కోసం ఈ బోగీలు వినియోగిస్తారు.
ఇక మరికొన్ని కోచ్‌లను ట్రాక్ సిబ్బంది విడిది కేంద్రాల కోసం కేటాయిస్తారు. అలాగే ప్రమాద సహాయక రైళ్లుగా మరికొన్ని బోగీలను వినియోగిస్తారు. ఇలా వివిధ అవసరాల కోసం కాలపరిమితి ముగిసిన కోచ్‌లు ఉపయోగపడతాయి. ఇక చారిత్రక ప్రాధాన్యత కలిగిన కోచ్‌లు, ఇంజిన్లను రైల్వే మ్యూజియంలో ఉంచుతారు. ఇటీవల రైల్వే కోచ్‌లను రెస్టారెంట్ థీమ్‌గా కూడా మార్చి ప్రయాణికులకు కొత్త అనుభూతిని అందిస్తున్నారు. ఇక పూర్తిగా పాడైన కోచ్‌ల, ఇంజిన్లను రైల్వేశాఖ ఆధ్వర్యంలోని వర్క్ షాపులకు తరలిస్తారు. చక్రాలు, స్ప్రింగ్‌లు, విలువైన విడిభాగాలను వేరుచేస్తారు. ఇవి పనికొస్తే ఇతర అవసరాల కోసం వినియోగిస్తారు. లేకపోతే ఈ-వేలం ద్వారా స్క్రాప్‌ను విక్రయిస్తారు. ఈ వేలం ద్వారా రైల్వేశాఖకు భారీగా ఆదాయం లభిస్తోంది. దీంతో కోచ్‌ల సర్వీస్ కాలం ముగిసిన తర్వాత కూడా ఏదొక రకంగా ఉపయోగపడతాయి. అంతేకానీ వృధాగా పోయేది ఏమీ ఉండదు.