
అక్టోబర్ నుండి ఇండియన్ రైల్వే, IRCTC కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. ఈ మార్పులు టికెట్ బుకింగ్, వెయిటింగ్ లిస్ట్, తత్కాల్, ప్రయాణ సమయంలో ఆహారం, లగేజీ పరిమితులు, బెడ్‌షీట్లు, దిండుల పంపిణీ వంటి అనేక అంశాలను ప్రభావితం చేస్తాయి. ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడం, అనవసరమైన ఇబ్బందులను నివారించడమే లక్ష్యంగా ఈ మార్పులను తీసుకొచ్చారు. తరచుగా రైలులో ప్రయాణించే వారితో పాటు అప్పుడప్పుడు ప్రయాణించే వారు కూడా ఈ కొత్త నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. అక్టోబర్ 1 నుండి రైల్వే స్టేషన్‌లలో, రైళ్లలో తనిఖీలు మరింత కఠినతరం అయ్యాయి. ఇకపై ప్రయాణికులు తమ టికెట్‌తో పాటు పాటు ఒరిజినల్ ప్రభుత్వ గుర్తింపు కార్డును తప్పనిసరిగా చూపించాలి. మొబైల్‌లో చూపించే టికెట్ స్క్రీన్‌షాట్లు లేదా ఐడీ జిరాక్స్ కాపీలు చెల్లవు. ఒకవేళ ఒరిజినల్ ఐడీ కార్డులోని పేరు టికెట్‌తో సరిపోలకపోతే.. ఆ ప్రయాణికుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లుగా పరిగణిస్తారు. దీనికి గాను కనీసం రూ.500 ఎక్సెస్ ఛార్జ్, అదనపు టికెట్ ఛార్జీలు వసూలు చేస్తారు.ఇతరుల టికెట్లపై ప్రయాణించడాన్ని అరికట్టడానికి ఈ చర్య తీసుకున్నారు
వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులు రిజర్వ్ చేయబడిన ఏసీ కోచ్, ఇతర రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణించడం పూర్తిగా నిషేధం. టికెట్ కన్ఫర్మ్ కాని ప్రయాణికులు అన్-రిజర్వ్డ్ జనరల్ కోచ్‌లలో మాత్రమే ప్రయాణించాలి. ఈ నియమం కోచ్‌లలో రద్దీని తగ్గించి, కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఉపయోగపడనుంది. ఇక ఇండియన్ రైల్వేస్ లగేజీ బరువు పరిమితులను మరింత కఠినతరం చేసింది. ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లగల లగేజీ పరిమాణంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. నిర్దేశిత పరిమితికి మించిన లగేజీకి అదనపు ఛార్జీలు విధిస్తారు. కొన్ని సందర్భాల్లో అధిక బరువు గల లగేజీని రైలులో అనుమతించకపోవచ్చు. సాధారణంగా, స్లీపర్ క్లాస్, ఏసీ క్లాస్‌లకు వేర్వేరు పరిమితులు ఉంటాయి. ప్రయాణానికి ముందు లగేజీ నిబంధనలను తనిఖీ చేసుకోవాలి. తత్కాల్ టికెట్ల బుకింగ్‌లోనూ కొన్ని మార్పులు వచ్చాయి. ఆధార్ ప్రామాణీకరణ తప్పనిసరి చేశారు. ఇది తత్కాల్ టికెట్లను బ్లాక్‌లో కొనుగోలు చేయడాన్ని అరికట్టడానికి, నిజమైన ప్రయాణికులకు అందుబాటులో ఉంచడానికి సహాయపడుతుంది.
ఇక టికెట్ రద్దు, టికెట్ డిపాజిట్ రసీదు నియమాలలో కూడా మార్పులు ఉన్నాయి. రిఫండ్ పొందేందుకు సంబంధించిన సమయ పరిమితులు, షరతులు మరింత స్పష్టం చేశారు. ప్రయాణికులు తమ టికెట్ రద్దు చేయాలనుకుంటే.. రిఫండ్ కోసం నియమిత కాలపరిమితిలో దరఖాస్తు చేసుకోవాలి. ఇక రాత్రిపూట మిడిల్ బెర్త్ ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని నియమాలు పాటించాలి. మిడిల్ బెర్త్‌లలో ఉన్నవారు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఉపయోగించుకోవడానికి అనుమతి ఉంటుంది. మిగిలిన సమయంలో లోయర్ బెర్త్ ప్రయాణికులు కూర్చోవడానికి వీలుగా వాటిని మడిచి ఉంచాలి.