భారత్ – అమెరికా చారిత్రాత్మక ఒప్పందం.. మన రైతులకు, వ్యాపారులకు పండగే.. మారనున్న వ్యాపార ముఖచిత్రం

భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో ఒక నూతన శకం ఆరంభమైంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఇరు దేశాలు చారిత్రాత్మక మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. సుంకాల తగ్గింపు నుంచి ఇంధన వ్యూహాల మార్పు వరకు.. అసలు ఈ ఒప్పందం వల్ల భారత్‌కు ఎటువంటి లాభం జరగనుంది అనేది తెలుసుకుందాం..

భారత్ - అమెరికా చారిత్రాత్మక ఒప్పందం.. మన రైతులకు, వ్యాపారులకు పండగే.. మారనున్న వ్యాపార ముఖచిత్రం
India Us Signs Historic Interim Trade Deal

Updated on: Feb 07, 2026 | 8:47 AM

అమెరికా – భారత్ మధ్య గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి తెరపడుతోంది. ఇరు దేశాల మధ్య సుంకాలను తగ్గించే, ఇంధన వాణిజ్యాన్ని సమూలంగా మార్చే ఒక కీలకమైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలవ్వడమే కాకుండా పూర్తి స్థాయి వాణిజ్య ఒప్పందానికి మార్గం సుగమమైంది. ఈ నూతన ఒప్పందం ప్రకారం.. మెజారిటీ భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు 50శాతం నుండి 18 శాతానికి తగ్గనున్నాయి. ముఖ్యంగా రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా గతంలో విధించిన 25శాతం అదనపు సుంకాన్ని ట్రంప్ రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.

500 బిలియన్ల డాలర్ల కొనుగోళ్లు

వచ్చే ఐదేళ్లలో భారత్ అమెరికా నుండి సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయనుంది. ఇందులో చమురు, సహజ వాయువు, కోకింగ్ బొగ్గుతో పాటు విమానాలు, విమాన భాగాలు, విలువైన లోహాలు ఉన్నాయి.

టెక్నాలజీ – AI రంగం

సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు అవసరమైన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు, డేటా సెంటర్ పరికరాలను భారత్ దిగుమతి చేసుకోనుంది.

వ్యవసాయం – పారిశ్రామిక రంగాలు

అమెరికాకు చెందిన పారిశ్రామిక వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులైన సోయాబీన్ నూనె, వైన్, తాజా పండ్లు, పశుగ్రాసంపై భారత్ సుంకాలను తగ్గించడానికి లేదా పూర్తిగా తొలగించడానికి అంగీకరించింది.

ఇంధన వ్యూహంలో మార్పు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుండి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయనుంది. దీనికి ప్రత్యామ్నాయంగా అమెరికా – వెనిజులా నుండి ఇంధన దిగుమతులను పెంచుకోవాలని భారత్ నిర్ణయించుకుంది. ఇది అంతర్జాతీయ ఇంధన రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుగా భావిస్తున్నారు.

ఎవరికి లాభం?

భారత వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. వస్త్రాలు, తోలు వస్తువులు, ప్లాస్టిక్, హస్తకళల రంగాలకు అమెరికా మార్కెట్‌లో భారీ అవకాశాలు లభిస్తాయి. సుంకాల తగ్గింపు వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధర లభిస్తుంది. చిన్న – మధ్య తరహా పరిశ్రమలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది గొప్ప అవకాశం. కాగా ప్రస్తుతానికి ఇదొక మధ్యంతర ఒప్పందం మాత్రమే. మార్చి నెలలో పూర్తి స్థాయి వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

 

రైతులకు కొత్త దిశ – మోదీ

ఈ చారిత్రాత్మక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత నిబద్ధత వల్లే ఇది సాధ్యమైందని, ఈ ఒప్పందం మన దేశంలోని రైతులు, యువత, స్టార్టప్ రంగానికి కొత్త దిశను చూపుతుందని అన్నారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఉత్పత్తులకు అమెరికా మార్కెట్‌లో భారీ అవకాశాలు లభించనున్నాయి. మన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు మార్గం సుగమమైందన్న మోదీ.. ఈ వాణిజ్య విస్తరణ ద్వారా పెద్ద ఎత్తున కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అంతర్జాతీయ పెట్టుబడులు, సాంకేతికత అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇది కేవలం రెండు దేశాలకే కాకుండా, ప్రపంచ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..