రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ తగ్గిపోతుందా? ఫ్లాట్లు ఇక తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయా?

భారత రియల్ ఎస్టేట్ బూమ్ ముగిసిందని నిపుణులు అంటున్నారు. ధరలు తగ్గుతాయని ఆశిస్తున్న వారికి నిరాశే. సార్థక్ అహుజా ప్రకారం, ఇళ్ల ధరలు స్థిరంగా ఉంటాయే తప్ప తగ్గవు. ఆదాయ పెరుగుదల కంటే ధరల పెరుగుదల ఎక్కువ కావడంతో ఇళ్లు సామాన్యులకు అందుబాటులో లేవు.

రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ తగ్గిపోతుందా? ఫ్లాట్లు ఇక తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయా?
Real Estate

Updated on: Oct 30, 2025 | 7:00 AM

రియల్ ఎస్టేట్ బూమ్ ఆగిపోతుందా? ఈ రంగం కుప్పకూలిపోతుందా? ఫ్లాట్ ధరలు తగ్గుతాయా? ఇటీవలి రియల్ ఎస్టేట్ స్థితి చూసి చాలా మందికి వస్తున్న డౌట్లు ఇవి. దీనికి సమాధానంగా నిపుణులు చెబుతున్న మాట ఏంటంటే.. రియల్ ఎస్టేట్ బూమ్ ముగిసిందని అంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా క్రమంగా అభివృద్ధి చెందుతున్న ఇండియాలోని ఆస్తి మార్కెట్ ఇప్పుడు దాని ఊపును కోల్పోవచ్చా అని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా లింక్డ్‌ఇన్‌లోని ఒక పోస్ట్‌లో ప్రశ్నను లేవనెత్తారు? భారతదేశంలో రియల్ ఎస్టేట్ బూమ్ ముగిసి ఉండవచ్చు, కానీ ధరలు తగ్గుముఖం పట్టకుండా స్థిరంగా ఉంటాయని ఆయన అన్నారు.

సామాన్యులు భరించలేని విధంగా ఇళ్ళు ఖరీదైనవిగా మారినప్పుడు, ధరలు పెరుగుతూనే ఉంటాయా లేదా తగ్గుతాయా అనే ప్రశ్నను అహుజా లేవనెత్తారు. గత కొన్ని సంవత్సరాల గణాంకాలను ఉటంకిస్తూ 2020 నుండి ఇండియాలో ఇళ్ల ధరలు ప్రతి సంవత్సరం దాదాపు 10 శాతం పెరిగాయని ఆయన అన్నారు. అదే సమయంలో ప్రజల సగటు ఆదాయంలో వార్షిక వృద్ధి దాదాపు 5 శాతం వద్ద మాత్రమే ఉంది. దీని వలన ఇల్లు కొనడం మరింత కష్టమైంది, ముఖ్యంగా ముంబై, గుర్గావ్ వంటి పెద్ద నగరాల్లో. ఇక్కడ సాధారణ ఇల్లు కొనడానికి ప్రజలు 20 నుండి 30 సంవత్సరాలు సంపాదించాలి.

సార్థక్ అహుజా ప్రకారం.. బిల్డర్లు ఇప్పుడు ఎక్కువ లాభాలు ఆర్జించడానికి అల్ట్రా-లగ్జరీ ప్రాజెక్టులపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ధరల గురించి పెద్దగా పట్టించుకోని కొనుగోలుదారులను వారు లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీని కారణంగా సరసమైన ఇళ్ల లభ్యత గణనీయంగా తగ్గింది. గత రెండేళ్లలో హైదరాబాద్‌లో అలాంటి ఇళ్ల సంఖ్య 70 శాతం తగ్గింది. ముంబైలో 60 శాతం తగ్గుదల, ఎన్‌సిఆర్‌లో 50 శాతం తగ్గుదల కనిపించింది.

ఈ కాలంలో భారత నిర్మాణ రంగంలో సంస్థాగత పెట్టుబడులు భారీగా పెరిగాయని కూడా ఆయన అన్నారు. 2024లోనే రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు 9 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టారని, ఇది 2023 కంటే 50 శాతం ఎక్కువ. ఈ పెట్టుబడిలో 63 శాతం విదేశీ పెట్టుబడిదారుల నుంచే వస్తున్నాయని ఆయన అన్నారు.

అమ్మకాలు తగ్గాయి.. మరి ధరలు?

అహుజా ప్రకారం.. ఇంత భారీ పెట్టుబడి ఉన్నప్పటికీ గత ఆరు నెలల్లో బిల్డర్ల అమ్మకాలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. కానీ ఆశ్చర్యకరంగా ఇళ్ల ధరలు స్థిరంగా ఉన్నాయి, తగ్గలేదు. భారతదేశంలోని హై-ఎండ్ ప్రాపర్టీ మార్కెట్‌లోని అనేక ఇళ్లను వెంటనే విక్రయించడానికి ఇష్టపడని వ్యక్తులు కలిగి ఉండటం వల్ల ఇది జరుగుతుందని అహుజా వివరిస్తున్నారు. ఇందులో ప్రవాస భారతీయులు (NRIలు), విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు లేదా చాలా సంపన్న కొనుగోలుదారులు ఉన్నారు. ఈ వ్యక్తులపై విక్రయించమని ఎటువంటి ఒత్తిడి లేదు.

ఇండియాలో సగటు ఇళ్ల ధరలు ఎప్పుడూ తగ్గలేదని అహుజా అన్నారు. రాబోయే 2-3 సంవత్సరాలు ధరలు స్థిరంగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ధరలు పెరుగుతాయనే భయంతో ఇల్లు కొనడానికి తొందరపడకూడదు. రియల్ ఎస్టేట్‌లో ఈ మందగమనం నిజంగా ఇల్లు కొనాలనుకునే కొనుగోలుదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని అహుజా అభిప్రాయపడ్డారు. చాలా మంది బిల్డర్లు తమ ఇంటి అమ్మకాల లక్ష్యాలను చేరుకోలేకపోయారు. అటువంటి పరిస్థితిలో వినియోగదారులు కొత్త ఇల్లు కొనడానికి బిల్డర్లతో చర్చలు జరపవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి