
సామాన్య విమాన ప్రయాణికులకు ఇదొక చేదువార్త అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల ప్రభావం నేరుగా విమాన టిక్కెట్లపై పడే అవకాశం ఉంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల పెరుగుదల కారణంగా ఏప్రిల్ 1 నుండి విమానయాన సంస్థలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవచ్చని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు అన్నారు. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన ATF ధరలను సవరిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1న జరగబోయే ధరల నిర్ణయం విమానయాన రంగానికి కీలకం కానుంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. ఇది నేరుగా విమాన ఇంధన ధరల పెరుగుదలకు దారితీస్తోంది.
విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో దాదాపు 35 నుండి 45 శాతం వాటా కేవలం ఇంధనానిదే ఉంటుంది. అందుకే ఇంధన ధరలు పెరిగితే ఆ భారం నేరుగా టిక్కెట్ ధరలపై పడుతుంది. ఇప్పటికే ప్రధాన విమానయాన సంస్థలు తమ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఫ్యూయల్ సర్‌ఛార్జ్ పేరుతో అదనపు బాదుడును మొదలుపెట్టాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ దేశీయ టిక్కెట్లపై రూ.399, అంతర్జాతీయ మార్గాల్లో గమ్యస్థానాన్ని బట్టి రూ.830 నుండి రూ. 16,600 వరకు అదనపు వసూళ్లు చేసే అవకాశం ఉంది. ఇండిగో దూరాన్ని బట్టి ఒక్కో సెక్టార్‌కు రూ. 425 నుండి రూ. 2,300 వరకు సర్‌ఛార్జ్ విధిస్తోంది. అకాసా ఎయిర్ప్రయాణ సమయాన్ని బట్టి రూ. 199 నుండి రూ.1,300 వరకు అదనపు ఛార్జీలు వేస్తుంది.
పరిస్థితి తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, ప్రయాణికులపై భారం తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ఇది కేవలం పౌర విమానయాన శాఖకు మాత్రమే పరిమితమైన అంశం కాదని, విదేశీ వ్యవహారాలు, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖలతో కలిసి సమన్వయంతో పరిష్కారం వెతకాల్సి ఉందని మంత్రి రామ్ మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న గగనతలాలను వదిలి, విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి రావడంతో ఇంధన వినియోగం మరింత పెరుగుతోంది. ఈ సవాళ్లను అధిగమిస్తూనే కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చూడటమే తమ ప్రాధాన్యతని ఆయన తెలిపారు. ఏప్రిల్ 1 తర్వాత విమాన టిక్కెట్ల ధరలు ఏ మేరకు పెరుగుతాయనేది ఇంధన కంపెనీలు ప్రకటించే ధరలపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రయాణికులకు ఎంతవరకు ఊరటనిస్తాయో వేచి చూడాలి.