Bullet Trains: హైదరాబాద్-బెంగళూరు, చెన్నై బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుపై కేంద్రం బిగ్ అప్డేట్.. పనులు ఎప్పటినుంచంటే..?

హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నైలకు కనెక్టివిటి కల్పిస్తూ నిర్మించనున్న బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. త్వరలోనే ఈ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. అటు హైదరాబాద్-ముంబై ప్రాజెక్ట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అధికారులు మార్కింగ్‌లు వేస్తున్నారు. ఇతర వివరాలు చూస్తే..

Bullet Trains: హైదరాబాద్-బెంగళూరు, చెన్నై బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుపై కేంద్రం బిగ్ అప్డేట్.. పనులు ఎప్పటినుంచంటే..?
Bullet Trains

Updated on: Jul 15, 2026 | 7:41 AM

హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై మధ్య హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కారిడార్ల పనులపై తాజాగా కేంద్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ మార్గాల్లో అత్యాధునిక బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది. దక్షిణ భారతదేశంలో అత్యంత కీలక నగరాలుగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటివి ఉన్నాయి. దీంతో ఈ మూడు నగరాల మధ్య అత్యంత వేగవంతమైన కనెక్టివిటీ కల్పించేందుకు బుల్లెట్ రైళ్ల కారిడార్లను నిర్మించనున్నారు. హైదరాబాద్ టు చెన్నై కారిడార్ అమరావతి మీదుగా వెళ్లనుంది. ఏపీ మీదుగా చెన్నైకి చేరుకోనుంది. ఈ కారిడార్ల రాకతో బుల్లెట్ రైళ్లకు హైదరాబాద్ పెద్ద హబ్‌గా మారనుంది.

అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక సదుపాయాలతో పున:నిర్మించే పనులు కొనసాగుతున్నట్లు అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా ఈ స్టేషన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అత్యంత ఆధునికంగా పున:నిర్మించనున్నట్లు చెప్పారు. దేశంలో మొత్తం 1300 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే 260 రైల్వే స్టేషన్ల పనులు విజయవంతంగా పూర్తయ్యాయన్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో 40 రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని, దీని వల్ల రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు మెరుగవుతాయని అన్నారు. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం బడ్జెట్‌ను భారీగా పెంచిందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

యూపీఐ హయాంలో కేవలం తెలుగు రాష్ట్రాలకు రూ.880 కోట్లు మాత్రమే వార్షిక బడ్జెట్ కేటాయించారని, కానీ మోదీ సర్కార్ తెలంగాణకు రూ.5 వేల కోట్లను కేటాయించిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామన్నారు. దీని వల్ల ప్రయాణికులకు ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పిస్తామని, విప్లవాత్మక సాంకేతిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. కాగా హైదరాబాద్ నుంచి మూడు బుల్లెట్ రైళ్ల కారిడార్లను కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్ టూ ముంబై రూట్ కూడా ఇందులో ఉంది. ఈ రూట్‌కు సంబంధించి ఇప్పటికే అధికారులు మార్కింగ్‌లు వేస్తున్నారు. నాలుగు లైన్లతో దీనిని నిర్మించనున్నారు. శంషాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా ఇది వెళ్లనుంది.

 

 

 

Follow Us