Bank Loan
దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, వారు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా ఆదాయాలను పెంచేందుకు వివిధ పథకాలను అమలు చేస్తుంది. వాటిలో వ్యాపారాల కోసం చేసే రుణ సహాయం ప్రధానమైనది. చాలామందికి వ్యాపారం చేసే నైపుణ్యం, ఆసక్తి ఉన్నాపెట్టుబడి లేకపోవడం ప్రధాన అవరోధంగా మారుతుంది. అలాంటి వారికి ఆర్థికంగా సాయపడితే వారు తమ కాళ్ల మీద నిలబడడంతో పాటు ఇంకొందరికి ఉపాధి చూపుతారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ప్రధానమంత్రి ముద్రాయోజన.
పీఎంఎంవై..
ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) ద్వారా తయారీ, వర్తకం, సేవా రంగాలకు సంబంధించి వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ సంస్థలకు రూ. 10 లక్షల వరకు రుణం అందజేస్తారు. వీటినే ముద్రా రుణాలు అంటారు. ఈ పథకంలో శిశు, కిషోర్, తరుణ్ అనే మూడు కేటగిరీలు ఉంటాయి. వ్యక్తులు, యాజమాన్య సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, పబ్లిక్ కంపెనీలు, ఇతర చట్టపరమైన ఫారమ్‌లు కూడా ఈ పథకం ద్వారా రుణసహాయం పొందవచ్చు. శిశు కేటగిరీలో రూ.50 వేలు, కిషోర్ కేటగిరీలో రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకూ, తరుణ్ కేటగిరీలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ రుణం అందజేస్తారు.
నిబంధనలకు లోబడి..
పీఎం ముద్రా పథకంలో ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాల ఆధారంగా రుణసంస్థలు వసూలు చేస్తాయి. అవి కాలానుగుణంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ప్రాసెసింగ్ చార్జీలు కూడా కొన్ని నిబంధనలకు లోబడి వసూలు చేస్తారు. ముఖ్యంగా శిశు రుణాల కోసం ముందస్తు రుసుం, అలాగే ప్రాసెసింగ్ చార్జీలను చాలా బ్యాంకులు మాఫీ చేశాయి.
అర్హతలు ఇవే..
- దరఖాస్తుదారు బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ డిఫాల్టర్ కాకూడదు. మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి.
- వ్యక్తిగత రుణం తీసుకునేవారు, తాము తెలిపిన పనిలో నైపుణ్యం కలిగి ఉండాలి.
- కొన్ని సందర్భాలలో విద్యార్హత అవసరమవుతుంది.
- ప్రభుత్వ రంగ బ్యాంకులు, స్టేట్ ఆపరేటింగ్ కో ఆపరేటివ్ బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు (ఎంఎఫ్ఐ), ప్రైవేట్ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్ బీఎఫ్సీ), స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు (ఎస్ఎఫ్ బీ), ఆమోదించిన ఏదైనా ఆర్థిక సంస్థల నుంచి ముద్రా రుణాలను పొందే అవకాశం ఉంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు..
- పీఎం ముద్రా రుణాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే ముందు మీ ఐడీ కార్డు, చిరునామా ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, దరఖాస్తుదారు సంతకం, వ్యాపార సంస్థల చిరునామా వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
ముందుగా పీఎం ముద్రా పథకం అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లాలి. తర్వాత ఉద్యమమిత్ర పోర్టల్‌ని ఎంచుకోవాలి.
అప్లయ్ నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- అక్కడ కనిపించిన న్యూ ఎంటర్ ప్రైనర్, ఎస్టాబ్లిష్ ఎంటర్ ప్రైనర్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్ తదితర ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోండి. తర్వాత మీ పేరు, ఈమెయిల్, మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలి.
- నమోదు చేసుకున్న తర్వాత వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారాన్ని నమోదు చేయాలి.
- లోన్ అప్లికేషన్ సెంటర్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
- శిశు, కిషోర్, తరుణ్ కేటగిరీలలో ఒకదానిని ఎంపిక చేసుకోండి.
- దరఖాస్తుదారు తప్పనిసరిగా తమ సంస్థ, వ్యాపారం గురించి వివరాలు అందజేయాలి.
- యజమాని డేటా, ప్రస్తుత బ్యాంకింగ్/క్రెడిట్ సౌకర్యాలు, భవిష్యత్తు ప్రణాళికలు, తాము రుణం తీసుకోవాలనుకునే సంస్థ తదితర వివరాలు నమోదు చేయాలి.
- పైన పేర్కొన్న సమాచారానికి అనుగుణంగా అన్ని ప్రతాలను అటాచ్ చేయండి.
- దరఖాస్తు సమర్పించిన తర్వాత మీకు అప్లికేషన్ నంబర్ వస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం దాన్నిగుర్తుపెట్టుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..