మీ ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు..? బ్యాంకు లాకర్‌లోని గోల్డ్ పోతే పరిహారం వస్తుందా..!

భారతీయుల జీవితాల్లో బంగారానికి ప్రత్యేక స్థానం. ఆపద సమయాల్లో ఆదుకునే అండగా దీనికి గోల్డ్ నిలుస్తుంది. అయితే కష్టపడి సంపాదించిన బంగారాన్ని భద్రంగా దాచుకోవడానికి బ్యాంక్ లాకర్లను నమ్ముతున్నారా? లాకర్‌లో ఎంత బంగారం ఉంచొచ్చు? ఒకవేళ బ్యాంకులోనే ఏదైనా ప్రమాదం జరిగితే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఇంట్లో ఎంతవరకు బంగారం ఉంచుకోవచ్చు..? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మీ ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు..? బ్యాంకు లాకర్‌లోని గోల్డ్ పోతే పరిహారం వస్తుందా..!
How Much Gold Can Be Kept In Bank Locker

Updated on: Aug 17, 2026 | 3:04 PM

భారతీయ సంస్కృతిలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్లు.. వేడుక ఏదైనా బంగారం కొనాల్సిందే. బంగారు ఆభరణాలను చాలామంది అత్యంత విలువైన ఆస్తిగా భావిస్తారు. ఇంట్లో ఉంచితే చోరీల భయం లేదా భద్రతా సమస్యలు ఉంటాయనే ఉద్దేశంతో ఎక్కువమంది బ్యాంకు లాకర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే లాకర్‌లో ఎంత బంగారం దాచుకోవచ్చనే విషయంపై కచ్చితమైన పరిమితి ఉందా? ఏదైనా ఊహించని ప్రమాదం లేదా దొంగతనం జరిగి బంగారం పోతే బ్యాంకు పూర్తి విలువను పరిహారంగా చెల్లిస్తుందా? ఇంట్లో ఎంత బంగారానికి లెక్కలు చూపించక్కర్లేదు? అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి.

లాకర్‌లో ఎంత బంగారం దాచుకోవచ్చు?

బ్యాంకు లాకర్‌లో ఉంచే బంగారం పరిమాణంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి గరిష్ట పరిమితిని విధించలేదు. మీ లాకర్ సామర్థ్యానికి అనుగుణంగా ఎంత బంగారాన్నైనా ఉంచుకోవచ్చు. అలాగే లాకర్‌లో ఏముందో వివరించాలని బ్యాంకులు కస్టమర్లను అడగవు.

నష్టం జరిగితే బ్యాంకు ఇచ్చే పరిహారం ఎంత?

లాకర్‌లో ఉంచిన బంగారం మొత్తం విలువకు బ్యాంకు భద్రత లేదా బీమా హామీ ఇవ్వదు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంకు నిర్లక్ష్యం, చోరీ, దోపిడీ, అగ్నిప్రమాదం లేదా సిబ్బంది మోసం వల్ల లాకర్ నష్టపోతే బ్యాంకు బాధ్యత కేవలం వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లు ఇవ్వడం మాత్రమే. ఉదాహరణకు.. మీ వార్షిక లాకర్ అద్దె రూ.3,000 అనుకుంటే, అందులో రూ.20-30 లక్షల విలువైన బంగారం ఉన్నప్పటికీ బ్యాంకు గరిష్టంగా రూ.3 లక్షలు మాత్రమే చెల్లిస్తుంది.

ప్రత్యేక ఆభరణాల బీమా అవసరమా?

బ్యాంకు నష్టపరిహార పరిమితి తక్కువగా ఉండటం వల్ల, భారీ విలువైన బంగారం లేదా వజ్రాభరణాలు ఉన్నవారు ప్రత్యేకంగా జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది.

ఇంట్లో బంగారం నిల్వపై నిబంధనలు

ఆదాయపు పన్ను శాఖ మార్గదర్శకాల ప్రకారం.. ఆదాయ ఆధారాలు చూపించాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉంచుకోగల పరిమితులు..

  • వివాహిత స్త్రీ: 500 గ్రాముల వరకు
  • పెళ్లి కాని స్త్రీ: 250 గ్రాముల వరకు
  • పురుషుడు: 100 గ్రాముల వరకు

బంగారం కొన్న బిల్స్, వారసత్వ పత్రాలు లేదా ఆదాయ ఆధారాలు ఉంటే ఈ పరిమితికి మించి కూడా ఇంట్లో ఎంత బంగారమైనా చట్టబద్ధంగా ఉంచుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us