
సాధారణంగా ఒక కారు ట్యాంక్ సామర్థ్యం 30 నుండి 50 లీటర్లు ఉంటుంది. కానీ ఆకాశంలో వేగంగా దూసుకుపోయే విమానాల ఇంధన ట్యాంకుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఒక పెద్ద విమానం ఒకేసారి వందలాది కార్లకు సరిపడా ఇంధనాన్ని తన ట్యాంక్‌లో నింపుకోగలదు. విమానం పరిమాణం, అది ప్రయాణించే దూరాన్ని బట్టి ఇంధన సామర్థ్యం మారుతుంటుంది. బోయింగ్ 737, ఎయిర్‌బస్ A320 విమానాల్లో సుమారు 23,000 నుండి 27,000 లీటర్ల ఇంధనం పడుతుంది. బోయింగ్ 777 సామర్థ్యం ఏకంగా 1,80,000 లీటర్ల వరకు ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానమైన ఎయిర్‌బస్ A380లో ట్యాంక్ నింపడానికి 3,20,000 లీటర్ల ఇంధనం అవసరం.
చాలామంది విమానాలు పెట్రోల్ లేదా డీజిల్‌తో నడుస్తాయని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. పెద్ద జెట్ విమానాలు జెట్-ఏ, లేదా జెట్-ఏ-1 రకానికి చెందిన ఇంధనాన్ని ఉపయోగిస్తాయి. ఇది అత్యంత శుద్ధి చేయబడిన స్వచ్ఛమైన కిరోసిన్. విమానాలు చాలా ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు ఉష్ణోగ్రతలు -40°C కంటే తక్కువకు పడిపోతాయి. అటువంటి స్థితిలో ఇంధనం గడ్డకట్టకుండా ఉండటానికి ప్రత్యేక రసాయనాలను ఇందులో కలుపుతారు. చిన్న పిస్టన్ ఇంజిన్ విమానాలు మాత్రం ఏవ్‌గాస్ అనే పెట్రోల్ లాంటి ఇంధనాన్ని వాడుతాయి.
ఒక పెద్ద విమానం గాలిలో ఎగురుతున్నప్పుడు గంటకు 5,000 నుండి 12,000 లీటర్ల ఇంధనాన్ని ఖర్చు చేస్తుంది. అంటే సెకన్ల వ్యవధిలోనే లీటర్ల కొద్దీ ఇంధనం కాలిపోతుంది. అందుకే విమానయాన సంస్థలకు ఇంధన ఖర్చే అతిపెద్ద భారం.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. దీనివల్ల జెట్ ఇంధనం ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా విమానయాన సంస్థలు మొక్కలు లేదా వ్యర్థాల నుండి తయారు చేసే సుస్థిర విమానయాన ఇంధనం (SAF) వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే ఇది ప్రస్తుతం చాలా ఖరీదైనది కావడంతో భవిష్యత్తులో విమాన టికెట్ల ధరలు సామాన్యులకు మరింత భారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.