
ప్రస్తుత రోజుల్లో సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, కారు కొనాలన్నా లేదా పిల్లల చదువులు, ఇతర అత్యవసర ఆర్థిక అవసరాలు వచ్చినా చాలామంది బ్యాంకు లోన్స్ తీసుకుంటున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందడం, ఆ తర్వాత ఓపికగా నెలనెలా ఈఎంఐల రూపంలో తిరిగి చెల్లించే వెసులుబాటు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే బ్యాంకు మనకు ఎంత లోన్ ఇస్తుంది అనేది పూర్తిగా మన జీతంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో నెలకు రూ.50,000 సంపాదిస్తున్న వ్యక్తికి ఎంత బ్యాంకు రుణం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక వ్యక్తి లోన్ కోసం అప్లై చేసుకోగానే బ్యాంకు ముందుగా చూసేది అతని నెలవారీ ఆదాయం ఎంత అని మాత్రమే. ఎందుకంటే అతను సంపాదించే జీతాన్ని బట్టే.. ఈఎంఐ ఎంతవరకు కట్టగలడో బ్యాంకులు ఒక అంచనాకు వస్తాయి. సాధారణంగా ఏ బ్యాంకైనా సరే, ఒక వ్యక్తి నెల జీతంలో గరిష్టంగా 50 శాతం మొత్తాన్ని మాత్రమే ఈఎంఐ కింద నిర్ణయిస్తాయి. ఒక వ్యక్తికి కుటుంబ ఖర్చులు, వ్యక్తిగత అవసరాలు ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకుని జీతంలో సగానికి మించి ఈఎంఐ భారం పడకుండా బ్యాంకులు ఈ నియమాన్ని పాటిస్తాయి.
ఉదాహరణకు.. మీ నెల ఆదాయం రూ. 50,000 అనుకుందాం. పైన చెప్పుకున్న రూల్ ప్రకారం మీ జీతంలో 50 శాతం అంటే.. మీరు నెలనెలా రూ. 25,000 వరకు ఈఎంఐ కట్టేందుకు అర్హులన్నమాట. ఇప్పుడు మీరు 9 శాతం వడ్డీ రేటుతో 20 సంవత్సరాల (240 నెలలు) సుదీర్ఘ కాలపరిమితితో హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకున్నారనుకుంటే.. బ్యాంకు మీకు దాదాపు రూ.28 లక్షల వరకు రుణాన్ని మంజూరు చేస్తుంది. ఈ రూ.28 లక్షల లోన్ మొత్తానికి మీరు నెలనెలా కట్టాల్సిన ఈఎంఐ కరెక్ట్‌గా రూ. 25,000 వరకు ఉంటుంది.
బ్యాంకు రుణం ఇవ్వడంలో కేవలం జీతం మాత్రమే కాదు.. రుణగ్రహీత యొక్క వయస్సు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. వయస్సు తక్కువగా ఉన్న యువకులకు బ్యాంకులు చాలా సులభంగా, ఎక్కువ మొత్తంలో లోన్లు ఇస్తాయి. ఎందుకంటే వారికి ఉద్యోగ కాలపరిమితి ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది కాబట్టి లాంగ్ టెర్మ్ లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు మొగ్గు చూపుతాయి. అదే వయస్సు పైబడిన వారికైతే తిరిగి చెల్లించే కాలపరిమితి తక్కువగా ఉంటుంది కాబట్టి రుణ మొత్తం కూడా తగ్గే ఛాన్స్ ఉంది.