House Construction: ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ 9 తప్పులు చేయకపోతే మీ భవనం నూరేళ్లు పదిలం!

House Construction: భవనాలలో పగుళ్లు చాలా సాధారణ సమస్య. దాదాపు ప్రతి వంద ఇళ్లలో 70-80 ఇళ్లలో గోడలు, ప్లాస్టరింగ్, బేస్‌మెంట్‌లలో పగుళ్లు కనిపిస్తాయి. అయితే, చాలా మంది తాత్కాలిక పరిష్కారాలతో సరిపెట్టుకుంటారు కానీ, అసలు పగుళ్లకు మూలకారణాలను గుర్తించరు. ఈ..

House Construction: ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ 9 తప్పులు చేయకపోతే మీ భవనం నూరేళ్లు పదిలం!
Building Cracks

Updated on: Aug 30, 2026 | 10:51 AM

House Construction: భవనాలలో పగుళ్లు అనేది నివాస, వాణిజ్య నిర్మాణాలలో సాధారణంగా ఎదురయ్యే ఒక కీలక సమస్య. గోడలు, ప్లాస్టరింగ్, బేస్‌మెంట్‌లు, బీమ్‌లు, కాలమ్స్, స్లాబ్‌లలో ఈ పగుళ్లు సంభవిస్తాయి. చాలా సందర్భాలలో ప్రజలు తక్షణ, తాత్కాలిక పరిష్కారాలపై దృష్టి పెడతారు కానీ, సమస్యకు మూలకారణాన్ని గుర్తించి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడం అత్యవసరం. పగుళ్లు వాటి తీవ్రత ఆధారంగా స్ట్రక్చరల్ మరియు నాన్-స్ట్రక్చరల్ అని రెండు రకాలుగా విభజించబడతాయి. స్ట్రక్చరల్ పగుళ్లు పునాది సమస్యలు, బీమ్‌లు, కాలమ్స్ బలహీనపడటం లేదా భూకంపాల వల్ల ఏర్పడి నిర్మాణం స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయి. నాన్-స్ట్రక్చరల్ పగుళ్లు సాధారణంగా మైనర్ హెయిర్‌లైన్ క్రాక్స్, ఇవి నిర్మాణానికి పెద్ద ప్రమాదాన్ని కలిగించవు.

ఇది కూడా చదవండి: House Construction Guide: ఇల్లు కడుతున్నారా? ఎలాంటి ఇటుక వాడాలి? ఈ పొరపాటు చేస్తే అంతే..!

పగుళ్లకు ప్రధాన కారణాలు

1. భూమి బేరింగ్ సామర్థ్యం, పునాది:

భవనం నిర్మాణం ప్రారంభించే ముందు భూమి బేరింగ్ సామర్థ్యాన్ని (SBC) పరీక్షించడం చాలా ముఖ్యం. వివిధ రకాల నేలలకు (గ్రావెల్, బ్లాక్ కాటన్, ఇసుక) వేర్వేరు SBCలు ఉంటాయి. భూమి సామర్థ్యాన్ని మించి లోడ్‌ను ప్రయోగించినప్పుడు, భూమి కుంగిపోతుంది. దీనివల్ల పునాదులు, కాలమ్స్, బీమ్‌లు కుంగిపోయి స్ట్రక్చరల్ పగుళ్లకు దారితీస్తాయి. సరైన SBC ఆధారంగా ఫుట్టింగ్ సైజును నిర్ణయించాలి. ఫుట్టింగ్ సైజు తక్కువగా ఉంటే లోడ్ ట్రాన్స్‌ఫర్ సరిగా జరగక భూమి కుంగిపోతుంది. ఎస్‌బీసీ పరీక్ష, సరైన ఫుట్టింగ్ డిజైన్ దాదాపు 99% స్ట్రక్చరల్ పగుళ్లను నివారిస్తుంది.

2. బేస్‌మెంట్‌ పగుళ్లు:

బేస్‌మెంట్‌లలో అడ్డంగా లేదా నిలువుగా పగుళ్లు ఏర్పడవచ్చు. బేస్‌మెంట్‌ కింద భూమి వదులుగా లేదా బలహీనంగా ఉండటం, లేదా బేస్‌మెంట్‌ లోపల మట్టి నింపేటప్పుడు అధిక భూమి ఒత్తిడి వల్ల ఈ పగుళ్లు ఏర్పడతాయి. బేస్‌మెంట్‌ నిర్మాణం చేపట్టే ముందు భూమిని గట్టిగా కాంపాక్ట్ చేసి, సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

3. ప్లింత్ బీమ్‌లు:

ప్లింత్ బీమ్‌లు భవనం గోడల లోడ్‌ను మోస్తాయి. వీటి డిజైన్ సరిగా లేకపోతే, కాంక్రీట్‌లో బలం లేకపోతే లేదా తగినంత స్టీల్ లేకపోతే, ప్లింత్ బీమ్‌లు బలహీనపడి వాటిపై ఉండే గోడలలో పగుళ్లు ఏర్పడతాయి. కొన్నిసార్లు కాలమ్స్, బీమ్‌లలో కూడా పగుళ్లు వస్తాయి. ప్లింత్ బీమ్ నిర్మాణాన్ని దృఢంగా ఉంచి, కాలమ్‌లను కలుపుతుంది. అందుకే వాటిని జాగ్రత్తగా డిజైన్ చేసి, నాణ్యమైన కాంక్రీట్, తగినంత రీఇన్‌ఫోర్స్‌మెంట్‌తో నిర్మించాలి.

4. ఇటుకల నాణ్యత, నిర్వహణ:

  • ఇటుకల నాణ్యత: బలహీనమైన ఇటుకలు లోడ్‌ను మోయలేక పగిలిపోతాయి. దీనివల్ల ప్లాస్టరింగ్‌లో పగుళ్లు వస్తాయి. నాణ్యమైన ఇటుకలను ఎంచుకోవాలి.
  • ఇటుకల సైజు: ఇటుకల సైజులు ఒకే విధంగా ఉండాలి. సైజులలో తేడాలు ఉంటే ప్లాస్టరింగ్ మందం మారడం వల్ల పగుళ్లు ఏర్పడతాయి.
  • ఇటుకలను తడపడం: గోడలు కట్టే ముందు ఇటుకలను కనీసం ఒక రోజు ముందుగా తడపాలి. పొడి ఇటుకలు మోర్టార్‌లోని నీటిని పీల్చుకొని, మోర్టార్ త్వరగా పొడిగా మారి పగుళ్లకు దారితీస్తుంది.
  • క్యూరింగ్: గోడలు కట్టిన తర్వాత కనీసం 7 రోజులు (14 రోజులు ఉత్తమం) క్యూరింగ్ చేయాలి. ఇది పగుళ్లను నివారిస్తుంది.

5. కాంక్రీట్ బ్యాండ్‌లు (క్రాక్ బ్యాండ్‌లు):

గోడలు కట్టేటప్పుడు మధ్యలో కాంక్రీట్ బ్యాండ్‌లను వేయాలి. ఇవి లోడ్‌ను సమానంగా పంచుతాయి. ఒక లేయర్‌లో ఏర్పడిన పగుళ్లు పై లేదా కింద లేయర్‌లకు వ్యాపించకుండా ఆపుతాయి. 9 అంగుళాల గోడకు ఒకటి, 4 అంగుళాల గోడకు ప్రతి 4 అడుగులకు రెండు బ్యాండ్‌లు వేయాలి.

6. లింటెల్స్:

కిటికీలు, తలుపుల పైన లింటెల్స్ తప్పనిసరిగా వేయాలి. ఇవి పైన గోడ లోడ్‌ను మోసి పక్క గోడలకు బదిలీ చేస్తాయి. లింటెల్ కనీసం 6 అంగుళాలు అటువైపు, 6 అంగుళాలు ఇటువైపు డోర్/విండో ఓపెనింగ్ దాటి ఉండాలి. లింటెల్ ఎత్తు కనీసం 6 అంగుళాలు ఉండాలి. అలాగే 12 మిమీ స్టీల్ బార్స్ వాడాలి. లింటెల్స్ లేకపోవడం లేదా సరిగా లేకపోవడం వల్ల కిటికీలు/తలుపుల పైన పగుళ్లు ఏర్పడతాయి.

7. సిమెంట్ నాణ్యత, మిక్స్:

  • సిమెంట్ గడువు తేదీ: సిమెంట్ ప్యాకెట్‌పై గడువు తేదీని (సాధారణంగా 3 నెలలు) తనిఖీ చేయాలి. గడువు దాటిన సిమెంట్ బలం కోల్పోయి పగుళ్లకు దారితీస్తుంది.
  • సిమెంట్ రకం: గోడలు, ప్లాస్టరింగ్‌కు పిసిసి (పోర్ట్‌ల్యాండ్ పోజోలనా సిమెంట్) వాడటం మంచిది. ఎందుకంటే ఇందులో హీట్ ఆఫ్ హైడ్రేషన్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల క్యూరింగ్ ఆలస్యమైనా పగుళ్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
  • మిక్స్ నిష్పత్తి: బ్రిక్ వర్క్ (1:5, 1:6), ప్లాస్టరింగ్‌కు సరైన సిమెంట్-ఇసుక నిష్పత్తిని వాడాలి. మాల్ కలిపిన తర్వాత 30 నిమిషాలలోపు వాడుకోవాలి. లేకపోతే అది గట్టిపడటం ప్రారంభిస్తుంది.

8. ప్లాస్టరింగ్ ముందు గోడల తయారీ:

ప్లాస్టరింగ్ చేసే ముందు గోడలను తడపాలి. పొడి గోడలు ప్లాస్టర్ మాల్‌లోని నీటిని త్వరగా పీల్చుకొని, ప్లాస్టర్ త్వరగా పొడిబారి పగుళ్లకు దారితీస్తుంది. గోడలపై ఉన్న పాచి లేదా గడ్డలు వంటి వాటిని శుభ్రం చేయాలి. స్లాబ్‌కు ప్లాస్టరింగ్ చేసేటప్పుడు హ్యాకింగ్ లేదా చిప్పింగ్ తప్పనిసరి. లేకపోతే ప్లాస్టర్ సరిగా అతుక్కోక పెచ్చులు ఊడిపడతాయి.

9. చికెన్‌/ రాబిట్ మెష్:

కరెంట్ పైపులు వేసిన చోట, పిల్లర్లు, బీమ్‌ల దగ్గర ప్లాస్టరింగ్ చేసేటప్పుడు చికెన్ మెష్ లేదా రాబిట్ మెష్‌ను ఉపయోగించాలి. ఇది పైపుల చుట్టూ, గోడ-కాలమ్/గోడ-బీమ్ జాయింట్ల వద్ద బలహీనమైన ప్రదేశాలలో పగుళ్లను నివారిస్తుంది. లోపలి ప్లాస్టరింగ్‌కు చికెన్ మెష్, బయటి ప్లాస్టరింగ్‌కు రాబిట్ మెష్ (మందంగా ఉంటుంది) ఉపయోగించవచ్చు.

ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా భవనాలలో పగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చు. నిర్మాణంలో ఉన్నవారు లేదా ఇప్పటికే పగుళ్లు ఎదుర్కొంటున్నవారు ఈ సూచనలను పాటించి శాశ్వత పరిష్కారాలను పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Fuel Tank Care: పెట్రోల్ బంక్‌లో ఈ 5 పొరపాట్లు అస్సలు చేయకండి.. మీ వాహనం దెబ్బతినే ప్రమాదం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us