ద్విచక్ర వాహనాల్లో హీరోహొండా కంపెనీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఈ కంపెనీ రెండు విడిపోయిన తర్వాత కొన్ని వేరియంట్లలో హోండా టాప్ లో ఉంటే.. మరికొన్ని సెగ్మెంట్లలో హీరోకి తిరుగులేదు. ముఖ్యంగా 125సీసీ పైన సామర్థ్యం ఉన్న బైక్ లలో హోండా తిరుగులేని ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. హోండా షైన్, యూనీకార్న్ వంటి మోడళ్లు మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ఇదే క్రమంలో 100సీసీ వేరియంట్లో హీరో కంపెనీదే ఆధిపత్యం. హీరో స్ల్పెండర్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ 100సీసీ వేరియంట్లో హోండా నుంచి ఎటువంటి వాహనాలు లేవు. ఆ లోటును పూడ్చుతూ.. ఇప్పుడు హీరో స్ల్పెండర్ కు పోటీగా హోండా కంపెనీ షైన్ 100సీసీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ధరను స్ల్పెండర్ కన్నా తక్కువే నిర్ణయించారు. పన్నులు మినహాయించగా.. కేవలం రూ. 64,900లకే ఈ బైక్ అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
గ్రామీణ వినియోగదారులే లక్ష్యంగా హోండా ఈ కొత్త బైక్ ని లాంచ్ చేసింది. హోండా షైన్ 100 బైక్ పనితీరు దాదాపుగా హీరో స్ల్పెండర్ ప్లస్ మాదిరే ఉంటుంది. ఈ బైక్ 97.2 cc, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ద్వారా శక్తిని ఇస్తుంది. ఈ బైక్ 7.5 Bhpతో 8.05 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండా షైన్ 100 4-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. సైడ్ స్టాండ్ ఉన్నప్పుడు ఇంజిన్ స్టార్ట్ కాదు.
హోండా కొత్త బైక్ ప్రధానంగా స్ల్పెండర్ కు పోటీగానే మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. మన దేశంలో 33% మోటార్‌సైకిల్ విక్రయాలు 100cc సెగ్మెంట్‌లో నమోదవుతుంటాయి. హీరో స్ప్లెండర్ ఈ సెగ్మెంట్‌లో దాదాపు 2,50,000 యూనిట్ల నెలవారీ విక్రయాలతో టాప్ సెల్లింగ్ బైక్‌గా రాణిస్తోంది. హోండా ప్రస్తుతం ఈ విభాగంలో షైన్ 100 మోటార్‌సైకిల్‌తో ఆదిపత్యం చెలాయించాలని ఆశిస్తోంది. అంతేకాక హెచ్‌ఎఫ్ డీలక్స్, హెచ్‌ఎఫ్ 100, బజాజ్ ప్లాటినా 100, టీవీఎస్ స్టార్ సిటీలతోనూ ఇది పోటీపడనుంది.
కస్టమర్లు హోండా షైన్ 100 బైక్‌ను అథారైజ్డ్ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. హోండా షైన్ 100 తయారీ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. డెలివరీలు 2023, మే నెలలో ప్రారంభమవుతాయి. ఈ ఆల్ న్యూ బైక్ బ్లాక్ విత్ రెడ్ స్ట్రిప్స్, బ్లాక్ విత్ బ్లూ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గ్రీన్ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గోల్డ్ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గ్రే స్ట్రైప్స్ అనే ఐదు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ లీటర్‌కి 65 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇవ్వనుందని సమాచారం.
హోండా షైన్ 100 స్పెషల్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్, నారో లెగ్ ఓపెనింగ్ యాంగిల్‌తో తేలికైన, మన్నికైన స్టీల్ ఫ్రేమ్‌తో లాంచ్ అయింది. ఇందులో ఆల్-బ్లాక్ అల్లాయ్ వీల్స్, అల్యూమినియం గ్రాబ్ రైల్, ఇంజన్ ఇన్హిబిటర్‌తో కూడిన సైడ్ స్టాండ్, కాంబి-బ్రేక్ సిస్టమ్ సైతం అందించారు. దీని సస్పెన్షన్ సెటప్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. బ్రేకింగ్ పవర్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (సీబీఎస్)తో పాటు ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లతో వస్తుంది. ఫ్రంట్ కౌల్, బోల్డ్ టెయిల్ ల్యాంప్, మఫ్లర్‌తో ఉన్న దీని స్టైలింగ్ షైన్ 125 బైక్‌ను పోలి ఉంది. ఈ కొత్త బైక్ సీటు పొడవు 677 మిమీ కాగా సీటు ఎత్తు 786 మిమీ. ఇది 1245 ఎంఎం వీల్‌బేస్, 168 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 1.9 మీటర్ల టర్నింగ్ రేడియస్‌తో వస్తుంది.
కంపెనీ షైన్ 100పై ప్రత్యేక 6-సంవత్సరాల వారంటీ ప్యాకేజీని (3 సంవత్సరాల స్టాండర్డ్ + 3 సంవత్సరాల ఆప్షనల్ ఎక్స్‌టెండెడ్ వారంటీ) కూడా అందిస్తోంది. హోండా తమ కొత్త షైన్ 100సీసీ బైక్ స్పీడ్, మైలేజ్ రెండింటిలోనూ 100cc విభాగంలో బెస్ట్‌గా నిలుస్తుందని చెబుతోంది. ఈ బైక్‌లో ఫ్యూయెల్ ఇంజెక్షన్, సోలనోయిడ్ టెక్నాలజీ ఇచ్చామని, దీని సాయంతో బైక్ ఏ వాతావరణంలో అయినా సులభంగా స్టార్ట్ అవుతుందని కంపెనీ వెల్లడించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..