హోమ్ లోన్ vs ప్రాపర్టీ లోన్.. మీకు ఏది బెస్ట్..? ఈ చిన్న తప్పులతో జేబుకు చిల్లే..!

సొంత ఇంటి కల నిజం చేసుకోవాలా? లేక మీ వ్యాపారానికి పెద్ద మొత్తంలో డబ్బు కావాలా? లోన్ కోసం బ్యాంకుకు వెళ్లినప్పుడు చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద కన్‌ఫ్యూజన్..హోమ్ లోన్ తీసుకోవాలా.. లేక ఆస్తిపై లోన్ తీసుకోవాలా అని.. ఈ రెండింటిలో వడ్డీ దేనికి తక్కువ ఉంటుంది? ఏ లోన్ ఎవరికి ఎక్కువ లాభం? ఈ విషయాలన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం..

హోమ్ లోన్ vs ప్రాపర్టీ లోన్.. మీకు ఏది బెస్ట్..? ఈ చిన్న తప్పులతో జేబుకు చిల్లే..!
Home Loan Vs Loan Against Property

Updated on: Sep 21, 2026 | 5:21 PM

మనిషి జీవితంలో ఆర్థిక భద్రతను నిర్మించుకోవడంలో స్థిరాస్తుల కొనుగోలు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికో లేదా ఇప్పటికే ఉన్న ఆస్తుల విలువ ఆధారంగా తక్షణ అవసరాలకు డబ్బుల కోసం బ్యాంకులు ప్రధానంగా రెండు రకాల లోన్ సౌకర్యాలను అందిస్తున్నాయి. అవే హోమ్ లోన్, ప్రాపర్టీ లోన్. ఈ రెండింటి నిబంధనలు పూర్తిగా వేర్వేరు కాబట్టి మీ ప్రస్తుత అవసరానికి తగినదాన్ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. హోమ్ లోన్ అనేది కొత్తగా ఒక ఇంటిని, ప్లాట్‌ను కొనడానికి లేదా సొంత స్థలంలో నూతన ఇళ్లు నిర్మించుకోవడానికి మాత్రమే బ్యాంకులు మంజూరు చేసే లోన్. దీనిని పొందడానికి దరఖాస్తుదారుడికి మెరుగైన క్రెడిట్ స్కోర్‌తో పాటు లోన్ సకాలంలో చెల్లించగల స్థిరమైన ఆదాయం ఉండటం తప్పనిసరి. బ్యాంకుల మధ్య నెలకొన్న తీవ్ర పోటీ కారణంగా హోమ్ లోన్లకు వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో పాటు 20 నుంచి 30 సంవత్సరాల వరకు సుదీర్ఘ కాలవ్యవధిలో రీపేమెంట్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.

మరోవైపు ఆస్తిపై లోన్ అనేది ఇప్పటికే మీ పేరిట ఉన్న నివాస లేదా వాణిజ్య స్థలాన్ని బ్యాంకు వద్ద తాకట్టు పెట్టి నగదు పొందే పద్ధతి. ఇందులో వచ్చే నిధులను ఇంటి నిర్మాణానికే కాకుండా వ్యాపార విస్తరణ, ఉన్నత చదువులు, వివాహ ఖర్చులు లేదా అత్యవసర వైద్య ఖర్చుల వంటి ఏ అవసరానికైనా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ లోన్‌లో మీ ఆస్తి మార్కెట్ విలువను బట్టి మాత్రమే డబ్బులు వస్తాయి. ఉదాహరణకు మీ ఆస్తి విలువ రూ.1 కోటి ఉంటే బ్యాంకు రూల్స్ ప్రకారం రూ. 50 లక్షల నుండి రూ. 70 లక్షల వరకే లోన్ లభిస్తుంది తప్ప పూర్తి కోటి రూపాయలు ఇవ్వరు.

ఈ రెండింటిలో ఏది మీకు సరైనదో తేల్చుకోవడానికి మీ అవసరమే గీటురాయి. మీరు కొత్తగా ఇంటిని తీసుకోవడం లేదా సొంత స్థలంలో కట్టుకోవాలనుకుంటే తక్కువ వడ్డీకే లభించే హోమ్ లోన్ బెస్ట్ ఆప్షన్. అలా కాకుండా ఇప్పటికే మీ వద్ద ఉన్న ఫ్లాట్ లేదా ఖాళీ స్థలాన్ని ఉపయోగించి కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా, లేదా పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనా దాన్నిపై లోన్ తీసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us