ప్రైవేటు ఉద్యోగాలంటే ఎప్పుడూ మెడమీద కత్తి వేలాడుతూ ఉంటుంది. మనకు నచ్చపోయినా.. మనం పనిచేసే యజమానికి మన పనితీరు నచ్చపోయినా వేరే దారి చూసుకోవాల్సిందే. ఇంకా హైక్ సరిగ్గా లేదని, గ్రోత్ సరిగా ఉండటం లేదంటూ చాలా మంది తరచూ ఉద్యోగాలు మారుతూ ఉంటారు. అలాంటి వారికి పీఎఫ్ ఖాతాల విషయంలో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా ఖాతా యాడ్ చేసుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అందుకోసం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్(ఈపీఎస్) నిబంధనలలో గణనీయమైన మార్పులు చేసింది. ఆ మార్పులు ఏమిటి? వాటి వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు ఒనగూరుతాయి? తెలుసుకుందాం రండి..
ఇంతకు ముందు ఆరు నెలల కంటే తక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులకు ఈపీఎస్ కి జమ చేసిన డబ్బును ఉపసంహరించుకునేందుకు వీలుండేది కాదు. అయితే దీనిని కూడా మార్చారు. కొత్త రూల్ ప్రకారం మీరు ఆరు నెలల కంటే తక్కువ కాలం పాటే ఈపీఎస్ కి కంట్రిబ్యూట్ చేసినా.. ఆ మొత్తాన్ని మీరు ఇప్పుడు విత్ డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది.
సాధారణంగా ప్రతి ఉద్యోగికి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది. దీనిని ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని ఉద్యోగులు తమ ప్రాథమిక జీతంలో 12శాతాన్ని ప్రావిడెంట్ కు జమ చేస్తారు. అలాగే ఉద్యోగి యజమాని కూడా 12శాతం కంట్రిబ్యూట్ చేస్తారు. దీనిలో 8.33శాతం ఉద్యోగి పెన్షన్ కార్పస్(ఈపీఎస్) వైపు మళ్లిస్తారు. మిగిలిన 3.67 శాతం ఉద్యోగి ఈపీఎఫ్ కార్పస్ లోకి వెళ్తుంది.
ఆరు నెలల కంటే తక్కువ కంట్రిబ్యూషన్ సర్వీస్ ఉన్న సభ్యులు ఉపసంహరణ ప్రయోజనాలు పొందలేరు. అయితే దీనిని సవరిస్తూ.. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆరు నెలల లోపు ఉద్యోగం చేసి మానేసినా తమ కంట్రిబ్యూషన్లను విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీని వల్ల 7లక్షణల మంది ఈపీఎఫ్ సభ్యులకు ప్రయోజనం కలుగనుంది. ఇప్పుడు ఉద్యోగులు తమ ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్లతో పాటు ఈపీఎస్ డబ్బును కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. అంటే ఈపీఎఫ్, ఈపీఎస్ రెండూ విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.
పూర్తి చేసిన ప్రతి నెల సర్వీస్ దామాషా ఉపసంహరణ ప్రయోజనాల కోసం లెక్కిస్తుందని నిర్ధారించడానికి కేంద్ర టేబుల్ డీ ని అప్ డేట్ చేసింది. టేబుల్ డీ అనేది పథకానికి అర్హత కోసం అవసరమైన సర్వీస్ ను చేరుకున్న లేదా 58 ఏళ్ల వయసును చేరుకున్న సభ్యులను సూచిస్తుంది. ప్రతి సంవత్సరం చాలా మంది ఈపీఎస్ సభ్యులు పింఛన్ల కోసం అవసరమైన పదేళ్ల కంట్రిబ్యూటరీ సర్వీస్ ను పూర్తి చేయడానికి ముందే పథకం నుంచి నిష్క్రమించినా.. ఉపసంహరణ ప్రయోజనాలు పొందుతారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 30 లక్షల కంటే ఎక్కువ ఉపసంహరణల ప్రయోజనాలు క్లయిమ్ పరిష్కరించామని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..