ప్రస్తుత రోజుల్లో పెరిగిన ఖర్చులు సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఆస్పత్రికి వెళ్తే అయ్యే ఖర్చు చూసి సగటు సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు. అయితే మనకు ఆరోగ్యం బాగాలేని సమయంలోనే ఆస్పత్రికి వెళ్తాం. లేదా అనుకోని ప్రమాదాలకు గురైన సమయంలోనే ఆస్పత్రి గుమ్మం తొక్కుతాం. ఈ నేపథ్యంలో ఆస్పత్రి ఖర్చుల నుంచి రక్షణ పొందేలా వచ్చిన మెడికల్ ఇన్సూరెన్స్‌లు అత్యంత ప్రజాదరణ పొందాయి. నెట్‌వర్క్ ఆస్పత్రులతో పాటు నాన్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా తిరిగి రీయింబర్స్‌మెంట్ చేసేలా ఆరోగ్య బీమా పథకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా గురువారం నుంచి దేశవ్యాప్తంగా ఆరోగ్య బీమా పాలసీల కింద ‘నగదు రహిత’ చికిత్సను ఎంచుకోవాలని సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు నిర్ణయించాయి. బీమా కంపెనీల తాజా నిర్ణయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
‘క్యాష్‌లెస్ ఎవ్రీవేర్’ విధానంలో పాలసీదారు వారు ఎంచుకున్న ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స పొందవచ్చు. ముఖ్యంగా ఆసుపత్రి బీమా కంపెనీ నెట్‌వర్క్‌లో లేకపోయినా నగదు రహిత సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దీని అర్థం పాలసీదారు ఎలీఆంటి డబ్బు చెల్లించకుండా ఆసుపత్రిలో చేరవచ్చు. అలాగే బీమా కంపెనీలు డిశ్చార్జ్ రోజున బిల్లును చెల్లిస్తాయి. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ అన్ని సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలతో సంప్రదించి ఈ చర్యను తీసుకుంది. సంబంధిత బీమా కంపెనీ అగ్రిమెంట్ లేదా టై-అప్‌లను కలిగి ఉన్న ఆసుపత్రులలో మాత్రమే నగదు రహిత సౌకర్యం ప్రస్తుతం అందుబాటులో ఉంది. అటువంటి ఒప్పందం లేకుండా పాలసీదారు ఆసుపత్రిని ఎంచుకుంటే నగదు రహిత సదుపాయాన్ని అందించేవారు కాదు. ఇలాంటి వినియోగదారుడు రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ కోసం వెళ్లవలసి ఉంటుంది. అలాగే క్లెయిమ్ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుండడంతో తాజా చర్యలు తీసుకున్నారు.
ప్రస్తుతం కేవలం 63% మంది కస్టమర్‌లు మాత్రమే నగదు రహిత క్లెయిమ్‌లను ఎంచుకున్నారని ఇతరులు రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని చూస్తున్నారని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ‘క్యాష్‌లెస్ ఎవ్రీవేర్’ విధానంలో ఖాతాదారుడు ప్రవేశానికి కనీసం 48 గంటల ముందు బీమా కంపెనీకి తెలియజేయాలి. అత్యవసర చికిత్స కోసం కస్టమర్ జాయిన్ అయిన 48 గంటలలోపు బీమా కంపెనీకి తెలియజేయాలి. పాలసీ నిబంధనల ప్రకారం క్లెయిమ్ ఆమోదయోగ్యంగా ఉండాలి. బీమా కంపెనీ ఆపరేటింగ్ మార్గదర్శకాల ప్రకారం నగదు రహిత సదుపాయం అనుమతిస్తుంది. ఈ తాజా చర్యలు మరింత మంది కస్టమర్లను ఆరోగ్య బీమాను ఎంచుకోవడానికి ప్రోత్సహిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి