
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ చూపిస్తున్నారు. ఇందులో భాగంగా బీమా పాలసీలు తీసుకుంటున్నారు. వివిధ కంపెనీలు అందిస్తున్న వీటితో ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. పాలసీదారులు వివిధ ఆస్పత్రులలో చికిత్స కోసం క్లయిమ్ చేసుకుంటారు. వాటిపై బీమా కంపెనీల నుంచి అప్రూవల్ రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ జాప్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్ఛేంజ్ (ఎన్ హెచ్ సీఎక్స్)ను ఏర్పాటు చేసింది.
బీమా కంపెనీలకు ప్రస్తుతం ప్రత్యేక పోర్టల్‌లు ఉన్నాయి. దీని కారణంగా ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడానికి సమయం పడుతోంది. నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్ఛేంజ్ (ఎన్ హెచ్ సీఎక్స్) అనేది నేషనల్ హెల్త్ అథారిటీచే అభివృద్ధి చేయబడిన డిజిటల్ హెల్త్ క్లెయిమ్ ప్లాట్‌ఫాం. ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను వేగవంతంగా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం)లో భాగంగా క్లెయిమ్ మార్పిడి అభివృద్ధి చేశారు. దీనిని రెండు మూడు నెలల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎన్ హెచ్ సీఎక్స్ ను అమలు చేయడానికి నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్ హెచ్ఏ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్ డీఏఐ) గతేడాది చేతులు కలిపాయి.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్ డీఏఐ) 2023 జూన్ లో ఒక సర్క్యులర్ జారీ చేసింది. బీమా సంస్థలు, ప్రొవైడర్‌లన్నింటినీ ఎన్ హెచ్ సీఎక్స్ లో చేరాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆదిత్య బిర్లా హెల్త్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్, బజాజ్ అలయన్జ్, హెచ్‌డీఎఫ్ సీ ఎర్గో, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్, ది న్యూ ఇండియా అస్యూరెన్స్, టాటా ఏఐజీ జనరల్, పారామౌంట్ టీపీఏ, యునైటెడ్ ఇండియా తదితర ఇన్సూరెన్స్ కంపెనీలు ఎన్ హెచ్ సీఎక్స్ ఇంటిగ్రేషన్‌ను పూర్తి చేశాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..