
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్ తన వినియోగదారులకు కొంత ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ను స్వల్పంగా తగ్గిస్తూ, ఎంపిక చేసిన స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 7, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయం ముఖ్యంగా MCLRకు అనుసంధానమైన గృహ రుణాలు, కార్ లోన్లు, ఇతర రుణాలు తీసుకున్న వినియోగదారులకు ప్రయోజనం కలిగించనుంది.
తాజా సవరణల తర్వాత బ్యాంక్ MCLR పరిధి 8.15 శాతం–8.55 శాతం నుంచి 8.10 శాతం–8.55 శాతానికి తగ్గింది. ఓవర్‌నైట్, ఒక నెల కాలపరిమితి రేట్లు 8.15 శాతం నుంచి 8.10 శాతానికి తగ్గించగా, మూడు నెలల రేటు 8.25 శాతం నుంచి 8.20 శాతానికి తగ్గింది. అయితే ఆరు నెలలు, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాల కాలపరిమితి రేట్లు వరుసగా 8.35 శాతం, 8.35 శాతం, 8.45 శాతం, 8.55 శాతం వద్ద యథాతథంగా కొనసాగుతున్నాయి.
RBI 2016లో ప్రవేశపెట్టిన MCLR విధానం ద్వారా బ్యాంకులు తమ రుణాల కనీస వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈ రేట్లు మారుతుండటంతో, వినియోగదారులు కూడా వడ్డీ మార్పుల ప్రయోజనం పొందగలుగుతారు. ఇదిలా ఉండగా, బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను కూడా సవరించింది. సాధారణ కస్టమర్లకు FD రేట్లు 2.75 శాతం నుంచి 6.50 శాతం వరకు ఉండగా, సీనియర్ సిటిజన్లకు అవి 3.25 శాతం నుంచి 7 శాతం వరకు ఉన్నాయి. ముఖ్యంగా 3 సంవత్సరాల 1 రోజు నుంచి 4 సంవత్సరాల 7 నెలల లోపు గల డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచడం జరిగింది. మొత్తం మీద MCLR తగ్గింపుతో రుణగ్రహీతలకు స్వల్ప ఉపశమనం లభిస్తుండగా, FD రేట్ల పెంపుతో డిపాజిటర్లకు కొంత ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి