GST: గుడ్ న్యూస్.. ఇల్లు కట్టడం.. కొనడం ఇక చౌక.. తగ్గనున్న ధరలు.. ఎలా అంటే..?

మీరు ఇల్లు కొనాలని ఆలోచిస్తుంటే, రానున్న రోజుల్లో మీకు పెద్ద ఊరట దక్కే అవకాశం ఉంది. ప్రభుత్వం కొన్ని వస్తువులుపై జీఎస్టీని తగ్గించేందుకు సన్నాహాలు చేస్తోంది. జీఎస్టీలో కొన్ని మార్పుల ప్రభావం ఇళ్ల ధరలను ప్రభావితం చేయనుంది. దీంతో పేద, మధ్య తరగతుల వారికి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

GST: గుడ్ న్యూస్.. ఇల్లు కట్టడం.. కొనడం ఇక చౌక.. తగ్గనున్న ధరలు.. ఎలా అంటే..?
Gst On Housing

Updated on: Aug 22, 2025 | 3:16 PM

ప్రతి పేద, మధ్యతరగతి వారి కల.. సొంత ఇల్లు. దాని కోం వారు ఎంతో శ్రమిస్తారు. సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా కొనాలని కలలు కంటున్న వారికి ఇది శుభవార్త. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రేట్లను ప్రభుత్వం త్వరలో మార్చే అవకాశం ఉంది. ఈ కొత్త పన్ను విధానం అమల్లోకి వస్తే ఇల్లు నిర్మించుకునే ఖర్చు తగ్గడంతో పాటు ఇంటి ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇల్లు కట్టడానికి ఉపయోగించే సిమెంట్, స్టీల్, టైల్స్, పెయింట్స్ వంటి వాటిపై వేర్వేరు పన్నులు అమల్లో ఉన్నాయి.

ఉదాహరణకు.. సిమెంట్, పెయింట్స్‌పై అత్యధికంగా 28శాతం వరకు పన్ను పడుతుండగా, స్టీల్‌పై 18శాతం జీఎస్టీ ఉంది. ఈ వేర్వేరు పన్నుల వల్ల మొత్తం నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుంది. చివరికి ఆ భారం ఇంటి కొనుగోలుదారులపై పడుతుంది. ప్రభుత్వం ఈ పన్ను రేట్లను ఒకే స్లాబ్‌గా తక్కువ స్థాయిలో నిర్ణయిస్తే, బిల్డర్లకు నిర్మాణ వ్యయం తగ్గుతుంది. ఆ ప్రయోజనం నేరుగా ఇల్లు కొనేవారికి అందుతుంది. ఇది మధ్యతరగతి వర్గాలకు పెద్ద ఊరటగా ఉంటుందని భావిస్తున్నారు.

మధ్యతరగతికి భారీ లాభం

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెరుగుదల వల్ల ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ప్రజలకు ఈ జీఎస్టీ సంస్కరణ ఒక గొప్ప రిలీఫ్ అని చెప్పొచ్చు. పన్నులు తగ్గితే ఇంటి ధర తగ్గుతుంది. దీని వల్ల ఈఎంఐ భారం కూడా కాస్త తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా గత ఐదేళ్లలో నిర్మాణ వ్యయం దాదాపు 40శాతం పెరిగిన నేపథ్యంలో ఈ పన్ను తగ్గింపు డెవలపర్లు, కొనుగోలుదారులు ఇద్దరికీ ఉపశమనం ఇస్తుంది. అయితే తక్కువ విలువ గృహాలపై పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఎందుకంటే వాటిపై ప్రస్తుతం కేవలం 1శాతం మాత్రమే జీఎస్టీ ఉంది. అయినప్పటికీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) విధానం మెరుగుపడితే, బిల్డర్ల వ్యయాలు మరింత తగ్గి ఆ ప్రయోజనం కొనుగోలుదారులకు కూడా అందవచ్చు.

లగ్జరీ ఇళ్లపై ప్రతికూల ప్రభావం?

మధ్యస్థ, అఫర్డబుల్ ఇళ్ళకు లాభం ఉన్నప్పటికీ ఈ కొత్త విధానం లగ్జరీ గృహాలపై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దిగుమతి చేసుకున్న ఫిట్టింగ్‌లు, ఖరీదైన వస్తువులు వంటి వాటిని ప్రభుత్వం 40శాతం పన్ను స్లాబ్‌లో చేర్చితే, బిల్డర్లు వాటి ధరలు పెంచడం లేదా లాభాలను తగ్గించుకోవడం చేయాల్సి ఉంటుంది. మొత్తంగా జీఎస్టీ సంస్కరణలు గృహ నిర్మాణ రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు సామాన్యుడి సొంతింటి కలను నిజం చేయడానికి దోహదపడతాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..