Gold Price: బంగారం ధర ఢమాల్..? తులం అంత తక్కువకు పడిపోతుందా..! ఈ లెక్కలు చూస్తే..

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మార్కెట్ నిపుణులు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి, వెండి ధరలకు త్వరలోనే భారీ బ్రేక్ పడనుందా? అంటే అవుననే అంటున్నాయి తాజా మార్కెట్ విశ్లేషణలు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకోబోయే ఒకే ఒక్క నిర్ణయం వల్ల, రాబోయే రోజుల్లో మన దేశంలో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1.20 లక్షల స్థాయికి పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Gold Price: బంగారం ధర ఢమాల్..? తులం అంత తక్కువకు పడిపోతుందా..! ఈ లెక్కలు చూస్తే..
Gold Price Fall Prediction India

Updated on: Nov 15, 2026 | 5:43 PM

భారతీయులకు బంగారం, వెండి కేవలం ఆభరణాలు మాత్రమే కాదు, భవిష్యత్తుకు భరోసా ఇచ్చే సురక్షితమైన పెట్టుబడులు కూడా. అయితే గత కొంతకాలంగా అంతర్జాతీయ పరిణామాల వల్ల పసిడి, వెండి ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునే వారికి మార్కెట్ నిపుణులు ఒక తీపి కబురు అందించారు. రాబోయే రోజుల్లో భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1.25 లక్షల మార్క్‌కు, ఆపై రూ. 1.20 లక్షల వరకు కూడా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణ పరిస్థితులు, అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకోబోయే నిర్ణయాల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. 2026 డిసెంబర్‌లో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో రెపో రేటును పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు క్రమంగా కిందికి దిగివస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో మద్దతు స్థాయిలు

ఈ పరిణామాలను విశ్లేషిస్తూ సెబీ రిజిస్టర్డ్ మార్కెట్ నిపుణుడు అనుజ్ గుప్తా కీలక అంచనాలను వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 3,800 డాలర్లు అనేది అత్యంత కీలకమైన మద్దతు స్థాయి. ఒకవేళ బంగారం ధర ఈ స్థాయిని దాటి కిందికి పడిపోతే, ఔన్సు ధర 3,400 నుంచి 3,350 డాలర్ల వరకు దిగివచ్చే అవకాశం ఉంది. వెండి విషయానికొస్తే.. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సుకు 50 – 48 డాలర్ల ముఖ్యమైన మద్దతు స్థాయిలుగా ఉన్నాయి. ఈ స్థాయిలను దాటి కిందికి చేరితే, వెండి ధర ఔన్సుకు 42 నుంచి 40డాలర్ల వరకు పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

దేశీయ మార్కెట్‌లో ధరలు ఎంతవరకు తగ్గొచ్చు..?

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్సుకు 3,800 డాలర్ల దిగువకు పడిపోతే.. దాని ప్రభావం భారత మార్కెట్‌పై భారీగా ఉంటుంది. అప్పుడు దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1.30 లక్షల నుంచి ఏకంగా రూ.1.20 లక్షల స్థాయికి పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కిలో వెండి ధర కూడా రూ.1.55 లక్షల నుంచి రూ.1.48 లక్షల వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్, పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్న సామాన్యులకు ఈ అంచనాలు కొంత ఊరటనిస్తున్నాయి. డిసెంబర్ ఫెడరల్ రిజర్వ్ భేటీ తర్వాత బంగారం, వెండి ధరల గమనంపై మరింత స్పష్టత రానుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us