Stock Market Crash: గ్లోబల్ మార్కెట్లలో భారీ పతనం.. కొవిడ్ తర్వాత నాస్‌డాక్‌కు అతిపెద్ద షాక్!

గ్లోబల్ స్టాక్ మార్కెట్లను భారీ అమ్మకాల ఒత్తిడి కుదిపేసింది. కొవిడ్ సంక్షోభం తర్వాత అమెరికా నాస్‌డాక్ సూచీ అత్యంత తీవ్రమైన పతనాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా టెక్నాలజీ, చిప్ తయారీ రంగాలకు చెందిన కంపెనీల షేర్లలో భారీ విక్రయాలు చోటుచేసుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. 2020 మార్చి తర్వాత టెక్, చిప్ షేర్లు కనిష్ఠ స్థాయిలకు పడిపోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది.

Stock Market Crash: గ్లోబల్ మార్కెట్లలో భారీ పతనం.. కొవిడ్ తర్వాత నాస్‌డాక్‌కు అతిపెద్ద షాక్!
Stock Market Crash

Updated on: Nov 06, 2026 | 11:13 AM

గ్లోబల్ మార్కెట్లను అమ్మకాల సునామీ ముంచెత్తింది. కొవిడ్ కాలం తర్వాత అమెరికా నాస్‌డాక్ సూచీ అత్యంత తీవ్రమైన పతనాన్ని నమోదు చేసింది. అమెరికా మార్కెట్లు కరెక్షన్ జోన్‌లోకి ప్రవేశించగా, ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాల తీవ్రత కనిపించింది. దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ సూచీ లోయర్ సర్క్యూట్‌ను తాకింది. మరోవైపు జపాన్, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజీలు బేర్ మార్కెట్ పరిధిలోకి వెళ్లాయి. ముఖ్యంగా టెలికాం, సెమీకండక్టర్, చిప్ తయారీ రంగాల షేర్లలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు రిస్క్‌తో కూడిన ఈక్విటీ పెట్టుబడుల నుంచి వెనక్కి తగ్గుతున్నారు. తమ పెట్టుబడులకు భద్రత కల్పించుకునే క్రమంలో యూఎస్ డెట్ సాధనాలు, జపనీస్ యెన్, స్విస్ ఫ్రాంక్ వంటి సురక్షిత పెట్టుబడి మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు కూడా వారాంతంలో తీవ్ర క్షీణతను సూచించాయి.

అయితే అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్నప్పటికీ, భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు కొనుగోళ్లను కొనసాగించడం ఆసక్తికరంగా మారింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లుగా విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్లలో నికర కొనుగోళ్లు జరుపుతున్నారు. 2021 ఫిబ్రవరి తర్వాత అత్యధిక స్థాయిలో క్యాష్ మార్కెట్‌లో కొనుగోళ్లు చేపట్టిన విదేశీ ఇన్వెస్టర్లుగా నిలిచారు. అయితే, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల వైఖరిలో మాత్రం మార్పు కనిపించింది. 2009 తర్వాత అతిపెద్ద స్థాయిలో విక్రయాలు నమోదు కావడం దేశీయ మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు నిఫ్టీ సాంకేతిక సూచిక అయిన రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ 75 పాయింట్లకు చేరింది. ఇది గత రెండేళ్లలో నమోదైన అత్యధిక స్థాయి. మార్కెట్‌లో కొనుగోళ్ల జోరు అధికంగా ఉన్నట్లు ఈ స్థాయి సూచిస్తోంది. అయితే ఆర్‌ఎస్‌ఐ అధిక స్థాయికి చేరుకోవడంతో సమీప కాలంలో మార్కెట్‌లో కొంత విరామం లేదా స్వల్ప కరెక్షన్ వచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహాలు, మార్కెట్ సాంకేతిక సూచికలు రానున్న సెషన్లలో కీలకంగా మారనున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Loading...
Unable to load recommendations.
Follow Us