
దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి FSSAI రాష్ట్రాల సహకారంతో విస్తృత స్థాయి తనిఖీలు, అమలు చర్యలను ముమ్మరం చేసింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 3.97 లక్షల ప్రదేశాలను తనిఖీ చేయగా, 1.65 లక్షలకు పైగా ఆహార నమూనాలను పరీక్షించారు. వాటిలో దాదాపు 17 శాతం నమూనాలు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని వెల్లడైంది. ఆహార భద్రత ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటూ మొత్తం 23,580 కేసులు పరిష్కరించారు. వీటిలో 1,756 కేసుల్లో శిక్షలు విధించగా, ఉల్లంఘనలకు పాల్పడిన సంస్థలపై రూ.154.87 కోట్ల జరిమానాలు విధించారు. ప్రజారోగ్యానికి ముప్పుగా ఉన్న 945 ఆహార ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించారు.
ఆహార వ్యాపార నిర్వాహకులలో సుమారు 98 శాతం రాష్ట్రాల పరిధిలో ఉండటంతో, అమలు బాధ్యత ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. జిల్లా స్థాయి అధికారులు తనిఖీలు, నమూనాల సేకరణ, ఫిర్యాదుల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో వీధి ఆహార విక్రేతలను కూడా వ్యవస్థలోకి తీసుకువచ్చే చర్యలు వేగవంతమయ్యాయి. ఈ ఏడాది 10 లక్షలకు పైగా స్ట్రీట్ ఫుడ్ విక్రేతలను నిబంధనల పరిధిలోకి చేర్చడం గమనార్హం.
ఇక లైసెన్సింగ్ వ్యవస్థను కూడా సరళీకరించారు. వ్యాపార పరిమాణాన్ని బట్టి ప్రాథమిక నమోదు, రాష్ట్ర లైసెన్స్, కేంద్ర లైసెన్స్ విధానం అమల్లోకి తీసుకువచ్చారు. ఆహార పరీక్షలను బలోపేతం చేసేందుకు సిక్కిం, ఆంధ్రప్రదేశ్ సహా 18 కొత్త ఆధునిక ప్రయోగశాలలకు ఆమోదం లభించింది. ఇదిలా ఉండగా FSSAI దర్యాప్తుకు సంబంధించిన సమాచారం లీక్ అయిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార వర్గాల ప్రకారం ఈ ఎఫ్‌ఐఆర్ ఎలాంటి మీడియా సంస్థలపై కాకుండా, రహస్య సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తులను గుర్తించడానికే దాఖలైంది. దర్యాప్తు గోప్యతకు భంగం కలిగించే చర్యలను కట్టడి చేయడమే ఈ చర్యల లక్ష్యమని స్పష్టం చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి