
Free Gas: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా ఇంధన సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇంధన భద్రతను పెంచడంతో పాటు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు వినియోగదారులను ఎల్‌పీజీ (సిలిండర్) నుండి పీఎన్‌జీ (పైపుడ్ నేచురల్ గ్యాస్) వైపు మళ్లించేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ అంశంపై పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ కీలక విషయాలు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: LPG Gas: సంచలన నిర్ణయం.. వీరికి నిలిచిపోనున్న గ్యాస్ బుకింగ్ సేవలు..!
దేశవ్యాప్తంగా పీఎన్‌జీ వాడకాన్ని పెంచేందుకు గ్యాస్ కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి. కొత్తగా పీఎన్‌జీ కనెక్షన్ తీసుకునే వారికి రూ. 500 విలువైన గ్యాస్ ఉచితంగా లభిస్తుంది. కనెక్షన్ కోసం చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్‌ను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
పీఎన్‌జీ సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని ఎల్‌పీజీ వినియోగదారులకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సమాచారం అందిస్తారు. అటువంటి వినియోగదారులు పీఎన్‌జీకి మారడానికి 3 నెలల సమయం ఇస్తారు. “ఎల్‌పీజీ కంటే పీఎన్‌జీ దిగుమతులపై మనకు ఆధారపడటం తక్కువ. అందుకే ఈ మార్పు ఎంతో తార్కికమైనది అని సుజాతా శర్మ వివరించారు.
గత 25 రోజుల్లోనే సుమారు 2.5 లక్షల కొత్త పీఎన్‌జీ కనెక్షన్లు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ వంటి నగరాల్లో పనులను వేగవంతం చేసేందుకు 24 గంటల పాటు పైప్‌లైన్ పనులు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అలాగే రోడ్డు పునరుద్ధరణ ఛార్జీలను కూడా రద్దు చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎల్‌పీజీ గ్యాస్‌పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎందుకంటే దేశంలో ఎల్‌పీజీకొరత ఉందని వైరల్ అవుతున్నాయి. దీనిపై కేంద్రం ఇప్పటికే స్పందించింది. దేశంలో ఎల్‌పీజీ కొరత ఉందనే వార్తలను ప్రభుత్వం ఖండించింది. ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదని, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కేంద్రం స్పష్టం చేస్తోంది. దేశంలో తగినంత ఎల్‌పీజీ ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరా స్థిరంగా ఉందని, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2,700 దాడులు నిర్వహించి, 2,000 సిలిండర్లను సీజ్ చేసినట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం 92% మంది వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారానే రీఫిల్ బుకింగ్స్ చేసుకుంటున్నారు.
పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితులపై ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచింది. మార్చి 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడగా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ రాయబారితో భేటీ అయ్యి ప్రాంతీయ పరిస్థితులపై చర్చించారు. ప్రభుత్వం ఒకవైపు అంతర్జాతీయంగా దౌత్య నీతిని ప్రదర్శిస్తూనే, మరోవైపు స్వదేశంలో ఇంధన ధరలు పెరగకుండా, సరఫరా ఆగకుండా పీఎన్‌జీ వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.
ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ మొదలైందిరా బాబోయ్.. బంగారం, వెండి ధరలు పరుగులే.. పరుగులు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి