
ప్రైవేట్ రంగంలో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత ఒక పెద్ద ఆందోళనగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీవితాంతం స్థిరమైన పెన్షన్ హామీ లేకపోవడంతో, వృద్ధాప్యంలో ఆదాయం ఎలా వస్తుందనే ప్రశ్న చాలా మందిని కలవరపెడుతుంది. అయితే ప్రతి నెలా జీతం నుండి PF కట్ అవుతున్న ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆధ్వర్యంలోని ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS) ఒక ముఖ్యమైన భరోసాను అందిస్తోంది.
చాలామంది ఉద్యోగులు PFలో జమయ్యే మొత్తం పదవీ విరమణ సమయంలో ఒకేసారి లభిస్తుందని మాత్రమే భావిస్తారు. కానీ ఇందులో ఒక కీలక అంశం EPS. ఉద్యోగి జీతం నుంచి కట్ అయ్యే PFతో పాటు, యజమాని చెల్లించే వాటాలో ఒక భాగం EPS ఖాతాలో జమ అవుతుంది. ఈ మొత్తం ఉద్యోగి పదవీ విరమణ తర్వాత నెలవారీ పెన్షన్ రూపంలో అందుతుంది. ఈ పెన్షన్ పొందడానికి కనీసం 10 సంవత్సరాల పెన్షన్‌కు అర్హత గల సర్వీస్ పూర్తి చేయాలి. అలాగే పూర్తి పెన్షన్ ప్రయోజనం పొందాలంటే ఉద్యోగి వయస్సు 58 సంవత్సరాలు పూర్తి కావాలి.
EPFO పెన్షన్ లెక్కింపు కోసం ఒక స్పష్టమైన సూత్రాన్ని అమలు చేస్తోంది: పెన్షన్ = (పెన్షన్ అర్హత గల జీతం × మొత్తం సేవా సంవత్సరాలు) ÷ 70
ఇక్కడ పెన్షన్ అర్హత గల జీతం విషయంలో ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. EPFO ప్రస్తుత నియమాల ప్రకారం.. పెన్షన్ లెక్కించేందుకు గరిష్ట జీత పరిమితి నెలకు రూ.15,000 మాత్రమే. అంటే ఉద్యోగి బేసిక్ జీతం ఎంత ఎక్కువగా ఉన్నా, పెన్షన్ మాత్రం రూ.15,000 ఆధారంగానే లెక్కించబడుతుంది. ఉదాహరణకు కన్హయ్య అనే ఉద్యోగి మే 2026లో పదవీ విరమణ చేస్తున్నారని, అతను మొత్తం 50 సంవత్సరాలు EPS కాంట్రిబ్యూషన్ చేశాడని అనుకుందాం. అప్పుడు అతని పెన్షన్ లెక్కింపు ఇలా ఉంటుంది: (15,000 × 50) ÷ 70 = రూ.10,714 (సుమారుగా). అంటే కన్హయ్యకు పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా సుమారు రూ.10,714 పెన్షన్ వస్తుంది.
అయితే ఈ పథకంలో వయస్సు కీలక పాత్ర పోషిస్తుంది. ఉద్యోగి 58 ఏళ్లు పూర్తి కాకముందే పెన్షన్ తీసుకోవాలని నిర్ణయిస్తే, ప్రతి సంవత్సరం 4 శాతం చొప్పున పెన్షన్‌లో కోత పడుతుంది. ఉదాహరణకు 50 ఏళ్ల వయస్సులోనే పెన్షన్ ప్రారంభిస్తే, మొత్తం పెన్షన్‌లో గణనీయమైన తగ్గుదల ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల EPFO-EPS పథకం ప్రైవేట్ ఉద్యోగులకు వృద్ధాప్యంలో కనీస స్థిర ఆదాయాన్ని అందించే ఒక ముఖ్యమైన ఆర్థిక రక్షణగా మారుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి