EPFO: ఉద్యోగం మారుతున్నారా..? పీఎఫ్ విషయంలో ఈ పొరపాటు చేస్తే డబ్బులు కోల్పోవడం గ్యారంటీ..

మీరు ఉద్యోగం మారుతున్నారా..? అయితే పీఎఫ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీలోకి పీఎఫ్ అకౌంట్ మార్చుకోవాలి. దీంతో పాటు పాత కంపెనీలోని బ్యాలెన్స్ కొత్త కంపెనీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా సులువుగా బదిలీ చేసుకునే సదుపాయం ఉంది.

EPFO: ఉద్యోగం మారుతున్నారా..? పీఎఫ్ విషయంలో ఈ పొరపాటు చేస్తే డబ్బులు కోల్పోవడం గ్యారంటీ..
Epfo

Updated on: Nov 28, 2026 | 12:06 PM

కొంతమంది తరచూ ఉద్యోగాలు మారుతుంటారు. ఇటీవల లేఆఫ్స్ ఎక్కువగా జరుగుతుండటంతో కొంతమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇలాంటివారు మరో కంపెనీలో చేరుతున్నారు. అయితే ఉద్యోగాలు మారేవారు తమ పీఎఫ్ ఖాతా గురించి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పీఎఫ్ అకౌంట్ అనేది పదవీ విరమణ తర్వాత భద్రతను కల్పిస్తుంది. మీరు జాగ్రత్తగా లేకపోతే నిధులను పొందటంలో సమస్యలు తలెత్తే అవకాశముంటుంది. ముఖ్యంగా ఉద్యోగం మారేటప్పుడు చేసే చిన్న తప్పులు పెద్ద నష్టాన్ని కల్గించవచ్చు. సర్వీస్ రికార్డులు తప్పుగా ఉండటం, బ్యాలెన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోకపోవడం వంటివి నష్టాన్ని చేకూరుస్తాయి. ఉద్యోగం మారేటప్పుడు పీఎఫ్ విషయంలో చేయాల్సిన పనులేంటో ఇందులో తెలుసుకుందాం.

పీఎఫ్ బ్యాలెన్స్ బదిలీ చేసుకోండి

మీరే వేరే కంపెనీలో చేరినప్పుడు పాత కంపెనీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను కొత్త కంపెనీలోకి తప్పనిసరిగా బదిలీ చేసుకోవాలి. పాత పీఎఫ్ అకౌంట్‌ను కొత్త కంపెనీలోకి విలీనం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ బ్యాలెన్స్ కొత్త కంపెనీలోకి రావడంతో పాటు పెన్షన్ సర్వీస్ కొనసాగింపును కాపాడటానికి సహాయపడుతుంది. ఈపీఎస్ స్కీమ్ కింద మీరు రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పింఛన్ పొందాలంటే 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. దీంతో మీరు ఉద్యోగ రికార్డులను అప్డేట్ చేసుకోవడం అవసరం. మీరు కొత్త కంపెనీలో చేరినప్పుడు వేరే యూఏఎన్ నెంబర్ పొందటానికి బదులు పాత యూఏఎన్ నెంబర్‌ను కొనసాగించాలి. ఇందుకోసం మీ పాత యూఏఎన్ నెంబర్‌ను కొత్త కంపెనీ యాజమాన్యానికి అందించాలి. దీని వల్ల ఒకేచోట మీ పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాక్ చేయవచ్చు. ప్రస్తుతం ఈపీఎఫ్ పోర్టల్‌లోకి వెళ్లి ఒకే క్లిక్‌తో నిధులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఆధార్ అనుసంధానమైన యూఏఎన్‌లు ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యే విధానాన్ని ఇటీవల ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది.

పీఎఫ్ రికార్డుల్లో తప్పులు

అలాగే మీ పీఎఫ్ రికార్డుల్లో తప్పులు ఉంటే సరిచేసుకోవాలి. పేరు, ఎంట్రీ/ఎగ్జిట్ డేట్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటివి తప్పుల్లేకుండా ఉండాలి. ఒక్కొ కంపెనీ సర్వీస్ రికార్డుల్లో ఒక్కొలా ఉండటం వల్ల నిధులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం, క్లెయిమ్ పొందటంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగాలు మారేటప్పుడు పీఎఫ్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు వివరాలు చెక్ చేసుకోవాలి. ఇక మీరు పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ పెట్టుకున్న తర్వాత ఆ ప్రక్రియ పూర్తయిందో.. లేదో చూసుకోవాలి.  మునుపటి బ్యాలెన్స్ జమ అయిందో లేదో నిర్ధారించుకోవడానికి  తాజా PF పాస్‌బుక్‌ను తనిఖీ చేసుకోవాలి. పూర్తి బదిలీ క్లెయిమ్‌లను పరిష్కరించడానికి EPFO ​ 20 రోజుల గడువు ఇచ్చింది. ఒకవేళ మీ బదిలీ ఆలస్యమైతే ఉద్యోగులు EPFO ​​పరిష్కార పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ ఖాతాలను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం వల్ల పరిపాలనాపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే మీ డబ్బులను కాపాడుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us